కొల్లాపూర్: మంత్రుల పర్యటన సందర్భంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో శనివారం జరిగిన కార్యక్రమాల్లో ఎంపీ మల్లు రవి (MP Mallu Ravi ) చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో వివాదస్పదంగా మారుతున్నాయి. బహిరంగసభలో మల్లు రవి మాట్లాడుతుండగా సభకు అధ్యక్షత వహించిన మార్కెట్ కమిటీ చైర్మన్ దండు నరసింహ సమయభావం లేదని, ఉపన్యాసం ముగించాలని మల్లు రవికి స్లిప్ ద్వారా విన్నవించాడు.
ఇది చదువుకున్న మల్లు రవి నరసింహపై అసహనం వ్యక్తం చేస్తూ నిన్నెవరూ స్టేజీ ఎక్కించారని, ‘ చేపల కూర, చికెన్ కర్రి తినడానికి రాలేదని ’ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆదివారం కొల్లాపూర్ నియోజక వర్గం మదాసి మదారి కురువ కుల సంఘ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంపీ మల్లు రవి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నియోజకవర్గంలో ఆందోళనలు చేపడుతామని కురువ సంఘం జిల్లా నాయకులు మల్లయ్య బీరయ్య, ధర్మయ్య రాంబాబు, ఓరి వెంకటస్వామి, దుబాయ్ స్వామి కొల్లే ఈశ్వర్, నాగరాజు, తరుణ్ హెచ్చరించారు.
మండల కమిటీ ఎన్నిక
పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో మాదాసి కురువ మండల కమిటీని జిల్లా అధ్యక్షుడు ఒరేయ్ నాగమల్లయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా బెటరీ నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా కొల్లే ఈశ్వర్, ఉపాధ్యక్షులుగా బీరయ్య, కార్యదర్శిగా నాగ మల్లయ్య, కోశాధికారిగా కొల్లే తిరుపతయ్య, సహాయ కార్యదర్శిగా శారదా మల్లేష్, వీరితోపాటు కార్యవర్గ సభ్యులుగా శారద రాముడు, పెద్ద మల్లయ్య, రాముడు, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మాదాసి కురువలకు ఎస్సీ సర్టిఫికెట్లను ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.