ఎర్రవల్లి చౌరస్తా, డిసెంబర్ 2 : కాంగ్రెస్ సర్కారు వచ్చాక గురుకులాలు సమస్యలకు కేరాఫ్‌గా మారాయని గురుకులబాట ఇన్చార్జి కురువ పల్లయ్య అన్నారు. సోమవారం ఎర్రవెల్లి మండలంలోని బీచుపల్లి, ఎర్రవెల్లిలోని అయిజ గురుకుల పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి.. గురుకులాలు జైలు అనుకుంటున్నావా..? అంటూ నిలదీశారు. బీచుపల్లి పాఠశాలలో విద్యార్థులకు తాగునీరు లేదని, రెండ్రోజులకోసారి స్నానం చేస్తున్నారని తెలిపారు.
ప్రహరీ లేక పందులు ఆవరణలోకి వస్తున్నాయని, క్లాస్రూంల్లోకి విషసర్పాలు వస్తున్నాయని వాపోయారు. అయిజ గురుకులంలో నాణ్యమైన భోజనం లేదని, బిల్డింగ్, కిటికీలకు జాలీలు లేవన్నారు. కూరగాయలు కుళ్లిపోయి ఉన్నాయని, ఈ పాఠశాల భవన యజమానికి గతంలో 10 నెలల అద్దె బకాయి ఉండడంతో గేటుకు తాళం వేసినట్లు గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో గురుకులాలు స్వర్ణయుగంగా మారగా.. రేవంత్ హయాంలో ఫుడ్‌పాయిజన్‌తో విలవిలలాడుతున్నాయని ధ్వజమెత్తారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు మాజ్, మత్తాలి, మాధవ్, రాజు, రామకృష్ణ, బషీర్ తదితరులు పాల్గొన్నారు.