మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/అచ్చంపేట : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రాక కోసం అచ్చంపేట గులాబీమయమైంది. ఆదివారం పట్టణంలో నిర్వహించనున్న జనగర్జన సభకు రానుండడంతో నాయకులు, కార్యకర్తల్లో జోష్ పెరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో గులాబీ దండు కదం తొక్కుతోంది. పట్టణంలో ఎక్కడ చూసినా భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు గులాబీ జెండాలతో రెపరెపలాడుతున్నాయి.
భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కేటీఆర్ పర్యటన ఉండడంతో నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా గ్రామాల్లో జనసమీకరణ చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో సభకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నారు. శనివారం మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మర్రితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. వర్షం నేపథ్యంలో జనానికి ఇబ్బందులు లేకు ండా రెయిన్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 25వేల మందిని సమీకరించేలా యోచిస్తున్నారు. కాగా, కేటీఆర్ రాకతో ఇటు సీఎం రేవంత్‌రెడ్డి ఇలాకాలో, అటు ఇటీవలే బీఆర్ఎస్లో చేరిన గువ్వల బా లరాజుకు సభ ముచ్చెమటలు పట్టించేలా చేస్తున్నది.
సభకు భారీ ఏర్పాట్లు..
జనగర్జన సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు, అభిమానులను అధికసంఖ్యలో తరలించేందుకు సమావేశాలు నిర్వహించి సమాయత్తం చేశారు. ఇటీవలే గులాబీ గూటి నుంచి గువ్వల బాలరాజు బీజేపీలో చేరగా, అతని వెంట బీఆర్ఎస్ సైన్యం వెళ్లకుండా కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచింది. కార్యకర్తల్లో మనోధైర్యం నింపడానికి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా రంగంలోకి దింపింది. దీంతో మర్రి నెల రోజులుగా అచ్చంపేట నియోజకవర్గంలో తిరుగుతూ క్యాడర్ భరోసా కల్పించారు.
సీఎం ఇలాకాలో..
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన అచ్చంపేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకతో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి సీఎంగా ఉంటూ ఉమ్మడి జిల్లాకు చేసిందేమీ లేదని, సర్కారును ఎండగట్టెందుకే జనగర్జన సభ అంటూ పార్టీ నేతలు ప్రకటించారు.
కార్యకర్తల్లో భరోసా కల్పించేందుకే..
అచ్చంపేట నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. చాలా మంది కాంగ్రెస్ నేతలు గులాబీ గూటికి చేరుతుండడంతో క్యాడర్లో ఫుల్ జోష్ నెలకొన్నది. అంతేకాకుండా ఇన్నాళ్లు బీఆర్ఎస్ను అడ్డం పెట్టుకొని రాజకీయ భవిష్యత్తును కాపాడుకున్న గువ్వల బాలరాజు బీజేపీలోకి చేరడంతో ఒక్కసారిగా కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు. నియోజకవర్గం కాకపోయినా బీఆర్ఎస్ తరఫున ఇక్కడ పోటీ చేయించి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకి ద్రోహం చేసిన గువ్వలకు తగిన బుద్ధి చెప్పాలని.. కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకే కేటీఆర్ అచ్చంపేటకు వస్తున్నారు.
కేటీఆర్ పర్యటన ఇలా..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన వివరాలను పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి కేటీఆర్ బయలుదేరుతారు. 12గంటలకు అచ్చంపేటకు చేరుకుంటారు. 12:30 గంటలకు ర్యాలీ ప్రారంభమై ఒంటిగంటకు బహిరంగ సభ వేదికకు చేరుకుంటారు. సాయం త్రం నాలుగు గంటలకు సభ ముగుస్తుంది. జనగర్జన సభకు పార్టీ నేతలు, కార్యకర్తలు 12గంటల వరకు సభ వేదికకు చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
స్థానిక ఎన్నికలకు శంఖారావం
బీసీలకు 42శాతం జీవో ఇచ్చి చ ట్టబద్ధతలేని వ్యవహారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చె బుతాం. ఇక్కడి నుంచే కేటీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారు. పార్టీకి వ్యక్తు లు ముఖ్యం కాదు.. పార్టీ ముఖ్యం. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ముందుకు సాగుతున్నది. కాంగ్రెస్ పార్టీ మోసాలను ఈ సభ ద్వారా ఎండగడుతాం. అచ్చంపేటలో మాజీ ఎమ్మెల్యే పార్టీ మారినా ఒక్క కార్యకర్త కూడా పోలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గంలో మెజార్టీ స్థానాలు దక్కించుకొని సత్తా చాటుతాం.
– మర్రి జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అచ్చంపేట సమన్వయకర్త