నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 28 : అచ్చంపేట జనగర్జన సభ విజయవంతమైంది. ఒంటిగంటకు ప్రారంభం కావాల్సిన జనగర్జన సభకు ఉదయం 11 గంటల నుంచే జనం రావడం మొదలు పెట్టారు. అచ్చంపేట నియెజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి భారీగా తరలివచ్చారు. ఆటోలు, జీపులు, ట్రాక్టర్లు, కార్లు, బస్సుల్లో జనం అచ్చంపేటకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకే సభాప్రాంగణం మొత్తం నిండిపోయింది. జనగర్జనలో మర్రి మార్క్ కనిపించింది.
అచ్చంపేట నియోజకవర్గం మొత్తం తిరుగుతూ కార్యకర్తలకు భరోసా కల్పించారు. కేటీఆర్ పర్యటన ఖరారు కాగానే సభను విజయవంతం చేసేందుకు ఇక్కడే మకాం వేశారు. మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, సహచర మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్ యాదవ్ కూడ మర్రికి అండగా నిలిచారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఓపెన్ డయాస్ కాకుండా రెయిన్ ప్రూఫ్ టెంట్లను వేసి సభను సజావుగా నిర్వహించారు. జనగర్జన విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్, బీజేపీ శిబిరాలు డీలాపడ్డాయి.
కేటీఆర్ సభను విఫలం చేసేందుకు సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో మంత్రుల పర్యటనను హడావిడిగా నాయకులు ఖరారు చేశారు. అయినా వంగూరు మండలం నుంచి పెద్ద సంఖ్యలో సభకు జనం తరలివచ్చారు. కొండారెడ్డిపల్లి నుంచి ఎవరూ వెళ్లకుండా బీఆర్ఎస్ నేతల ఇండ్లపై నిఘా ఉంచినా.. ఎన్ని జిమ్మిక్కులు చేసినా దండులా వచ్చారు. అలాగే పార్టీ మారిన గువ్వల బాలరాజుకు షాక్ ఇచ్చారు. అన్ని మండలాల నుంచి.. గ్రామాల నుంచి భారీగా హాజరయ్యారు. దీంతో పట్టణమంతా పండగ వాతావరణం నెలకొంది. పదివేల మందికిపైగా వస్తారని ఊహించగా రెండింతలుగా తరలిరావడంతో ఎప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు రాలేదని పార్టీశ్రేణులు చర్చించుకుంటున్నారు.
పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివాదం చేస్తుండడంతో జనం అడుగడుగునా నీరాజనం పలికారు. దాదాపు రెండుకిలో మీటర్ల పొడవునా అచ్చంపేట పట్టణమంతా గులాబీ దండు ముందు నడుస్తుండగా ర్యాలీ కొనసాగింది. అభిమానులు కేటీఆర్‌కు భారీ గజమాలవేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆలస్యమైనప్పటికీ సభలో కేటీఆర్ కోసం ఎదురు చూస్తూ ఘన స్వాగతం పలికారు.
సభాస్థలానికి కేటీఆర్ వచ్చిన సమయంలో పార్టీ శ్రేణులు, అభిమానులు కేరింతలు కొడుతూ, సెల్ఫోన్లలో వీడియోలు తీస్తూ తమ అభిమానాన్ని చాటారు. ఓవైపు ర్యాలీ పాల్గొన్న పార్టీ శ్రేణులు, అభిమానులకంటే సభాస్థలంలో అంతకంటే ఎక్కువ జనాలు కనిపించడంతో కేటీఆర్ సంతోషపడ్డారు. సభలోకి వస్తున్న సమయంలో కేటీఆర్‌తో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీపడ్డారు. కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో సభాస్థలం నిండిపోగా చుట్టుపక్కల పార్టీశ్రేణులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిలిచుండిపోయారు. కేటీఆర్ ప్రసంగిస్తుంటే కేరింతలు కొడుతూ కాంగ్రెస్‌ను బొందపెట్టాలంటూ నినాదాలు చేస్తూ కేరింతలు కొడుతూ ఈలలు వేశారు.