లోక కల్యాణం కోసం శ్రీకృష్ణ భగవానుడు కారాగారంలో జన్మించాడు. నల్లనయ్య పుట్టుకే ఓ మహా విశేషం. మానవత్వంలో దైవత్వాన్ని చూపిన కృష్ణావతారం ఒక అద్భుతం. యుగయుగాలుగా శ్రీకృష్ణుడి తత్వం.. జీవితం మానవ జాతిని విశేషంగా ప్రభావితం చేస్తున్నది. శ్రీమన్నారాయణుడు దైవ, మానవోద్ధరణ కోసం దశావతారాలు ఎత్తాడు. దైవమైనా, మానవుడైనా జీవితకాలంలో అనేకానేక కష్టనష్టాలు, ఆపదల నుంచి విముక్తి పొందే మార్గాలను చూపడమే ఈ అవతారాల పరమార్థం. కలియుగం నడుస్తున్నా ద్వాపరయుగంలో జగద్గురువుగా శ్రీకృష్ణ భగవానుడు చూపిన, అనేక మార్గాలను అవలంబిస్తూ ఆపదల నుంచి గట్టెక్కేందుకు మనం నిర్వహించుకునే ఉత్సవమే శ్రీకృష్ణాష్టమి. ఈ పర్వదినం సందర్భంగా నేడు పల్లెపల్లెన ఉట్లు కొట్టనున్నారు.
కందనూలు, సెప్టెంబర్ 6 : గోపాలుడిని నిష్టగా పూజిస్తే సకల బాధలు పోయి సంతోషం, సంపదలు పెరుగుతాయని భక్తుల నమ్మకం. సనాతన పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం రోహిణి నక్షత్రంలో భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం అష్టమి రోజున కృష్ణాష్టమి పండుగను జరుపుకొంటారు. గోపాలుడి లీలల కారణంగా ఆయనను ఎన్నో పేర్లతో పిలుస్తారు. వాటిలో ఒకటి శ్యామ్. శ్యామ్ అంటే నీలం అని అర్థం. అంతేకాకుండా శ్రీకృష్ణుడి శరీర రంగు కూడా నీలం రంగులోనే ఉంటుంది. అధర్మాన్ని పూర్తిగా తుడిచిపెట్టి ధర్మస్థాపన కోసం శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో మానవ రూపంలో అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి.
గోపాలుడు దేవకి గర్భం నుంచి జన్మించాడు. అయితే శ్రీకృష్ణుడి మేనమామ కంసుడు దేవకి ఎనిమిదో సంతానం చేతిలో తాను చంపబడతాడని తెలుసుకొని శ్రీకృష్ణుడిని చంపడానికి శతవిధాలా ప్రయత్నించాడు. ఎన్ని చేసినా గోపాలుడిని ఏం చేయలేకపోతాడు. తనవల్ల కావట్లేదని తెలుసుకున్న కంసుడు శ్రీకృష్ణుడిని చంపడానికి పుతానా అనే రాక్షసుడిని పంపుతాడు. పుతానా పాలలో విషం కలిపి గోపాలుడికి ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు. ఈ విషయం శ్రీకృష్ణుడికి తెలిసినా విషం తాగుతాడు. అయితే ఆ విషం ప్రభావితం చేయకపోయినా విషం ద్వారే పుతానుడిని చంపుతాడు. అయితే విషం కారణంగా శ్రీకృష్ణుడి శరీరం నీలం రంగులోకి మారుతుంది.
మరో పురాణం ప్రకారం.. ఒకసారి శ్రీకృష్ణుడు నది ఒడ్డున గోపికలతో ఆడుకుంటుంటాడు. అయితే వారు ఆడుకుంటున్న బంతి పకన ఉన్న యమునా నదిలోకి వెళ్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు బంతిని తీసుకోవడానికి యమునా నదిలోకి వెళతాడు. అయితే ఆ రోజుల్లో యమునా నదిలో కాలియా అనే విషపూరితమైన నాగు ఉండేది. కన్నయ్య వెళ్లిన శబ్దానికి యమునా నదిలోకి వెళ్తూ నాగుడు బయటకు రాగా, నాగు విషం కారణంగా యమునా నది నీరంతా నీలం రంగులోకి మారుతుంది. కాళియా నాగునికి, శ్రీకృష్ణుడికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో గోపాలుడు కాలియా నాగును ఓడించాడు. అయితే విషం ప్రభావంతో శ్రీకృష్ణుడి శరీరం నీలం రంగులోకి మారిపోయిందని పురాణం చెబుతోంది.
శ్రీకృష్ణ ఆరాధన ఇలా..
కృష్ణుడిని పూజించడం వల్ల అహంకారం నశిస్తుంది. క్రూరత్వం తొలగిపోతుంది. దాంపత్య ఆటంకాలు తొలగిపోతాయి. పెళ్లికాని వారికి వివాహం జరుగుతుంది. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుడిని పూజిస్తారు. శ్రావణమాసంలో లభించే పండ్లు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెడుతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాలను పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడుతారు. పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడుతారు.
అందుకే ఈ పండుగని ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్లు అని పిలుస్తారు. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరించినా, గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసినా ఫలం దకుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మశాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదిమని కూడా వివరించింది. ప్రతి ఏడాది శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలో అష్టమి తిథి వేళ శ్రీకృష్ణుడు పుట్టినరోజును జన్మాష్టమిగా జరుపుకొంటారు.
ఈసారి సెప్టెంబర్ 6, 7వ తేదీ బుధ, గురువారాల్లో కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోనున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కన్నయ్యకు వెండి వేణువును సమర్పించాలి. వేణు మాధవుడికి వేణువు లేకుండా పూజ పూర్తి కాదని పండితులు చెబుతారు. అందుకే ఈ స్వామిని మురళీధరుడని కూడా అంటారు. పూజ పూర్తయిన తర్వాత దాన్ని మీ దగ్గర లేదా మీరు డబ్బులు దాచుకునే చోట భద్రంగా దాచుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు వేణు మాధవుని ఆశీస్సులు ఉంటాయి. జన్మాష్టమి రోజున కన్నయ్యకు ఎంతో ఇష్టమైన వెన్న, రాతి పంచదార(కండచకెర)ను నైవేద్యంగా సమర్పించాలి. ఈ నైవేద్యాన్ని ఏడాదిలోపు పిల్లలకు తినిపించాలి. అలాగే అందంగా అలంకరించబడిన ఊయల తెచ్చి శ్రీకృష్ణుడి విగ్రహంతో తూకం వేయాలి.
పండుగ వేళ తులసి దళాన్ని సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం సులభంగా దొరుకుతుందని చాలా మంది నమ్మకం. రక్షా బంధన్ రోజున శ్రీకృష్ణుడికి రాఖీ ఎలా కడతారో.. ఈ పండుగ పూట శ్రీ క్రిష్ణుడికి, బలరాముడికి రాఖీ కట్టాలి. అదేవిధంగా కన్నయ్యకు ఇష్టమైన మల్లెపూలు, పారిజాతం లేదా దేవగాని పువ్వులను సమర్పించాలి. శ్రీకృష్ణుడి పూజలోనూ వీటిని వాడొచ్చు. శ్రీ కృష్ణాష్టమి రోజున ధార్మిక స్థలానికి వెళ్లి మీ సామర్థ్యం మేరకు పండ్లు, ధాన్యాలు, బట్టలను దానం చేయాలి. కృష్ణునికి చెరుకు లేదా తీపి పదార్థాలు నైవేద్యంగా పెడితే ఇంట్లో చిన్నారులకు చకని మాటతీరు వస్తుందని పెద్దల నమ్మకం. అంతేకాకుండా ఏదైనా ఆలయంలో పెరుగు దానం చేస్తే ఆ పిల్లలు ఉత్తమ సంతానంగా ఎదిగి సంసారవంతులుగా ఉంటారని పెద్దలు చెబుతుంటారు.
ప్రపంచవ్యాప్తంగా వేడుకలు..
శ్రీకృష్ణ జన్మాష్టమిని ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాలుగా జరుపుకొంటారు. వైష్ణవ ఆలయాలు ఉన్న చోట వేడుకలు ఉదయాన్నే ప్రారంభమవుతాయి. శ్రీకృష్ణుడు శ్రావణమాసం బహుళాష్టమి అర్ధరాత్రి సమయంలో జన్మించాడు. కన్నయ్య జన్మించిన సమయానికి అష్టమి తిథి ఉండటం ప్రధానమంటారు. వైష్ణవులు మాత్రం సెప్టెంబరు 7నే కృష్ణాష్టమి జరుపుకొంటారు. వారికి రోహిణి నక్షత్రంలో కూడిన అష్టమి ప్రధానం. మిగిలిన వారికి కృష్ణాష్టమి సెప్టెంబరు 6 బుధవారమే. ఈ రోజున ఉపవాసం ఉంటారు. ధూపం వేస్తారు, భగవద్గీత చదువుతారు.