కొల్లాపూర్, మార్చి1 : నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలంలో కాంగ్రెస్ పార్టీ గుండాల దాడిలో గాయపడ్డ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యులను శనివారం కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి పరామర్శించారు. దాడి జరిగిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. కొల్లాపూర్ ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడంతోపాటు డాక్టర్లను అడిగి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్యుల సూచన మేరకు తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడులకు భయపడకుండా, గుండె నిబ్బరం కోల్పోవద్దని, అన్ని విధాల పార్టీ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ గుండాల దాడిలో ధ్వంసమైన కారును కూడా బీరం హర్షవర్దన్ రెడ్డి పరిశీలించారు.
బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక వారి కుటుంబ సభ్యులు, మహిళలపై అర్ధరాత్రి దాడి చేయడం పిరికి పందల చర్య అని బీరం హర్షవర్దన్ రెడ్డి మీడియాకు చెప్పారు. గాయపడిన వారు చికిత్స కోసం కొల్లాపూర్ ప్రభుత్వ దవాఖానకు వస్తే పట్టపగలు కారు అడ్డం పెట్టి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా గొడ్డళ్లు, ఇనుపరాడ్లతో దాడి చేసే చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసన్నారు. ‘మీరు మా కార్యకర్తలపై రాళ్లతో దాడి చేస్తుంటే మేము రసగుల్లాలతో దాడి చేస్తామని అనుకోవద్దు’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
శుక్రవారం అర్ధరాత్రి దాడి జరిగిన వెంటనే కోడేరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా దాడి చేసిన వారికి పోలీసులు కొమ్ము కాస్తున్నారని బీరం హర్షవర్దన్ రెడ్డి ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వస్తే గేట్లు వేసిన ఘటన రాష్ట్రంలో కొల్లాపూర్‌లో మాత్రమే జరిగిందన్నారు. ఈ పరిణామాలు మంత్రి జూపల్లి దౌర్జన్యాలకు అద్దం పడుతుందన్నారు. ఎన్నికల తర్వాత రాజు కుటుంబానికి ఆర్థికంగా నష్టం కలిగించడంతో పాటు కాంగ్రెస్ నాయకులు మూడోసారి దాడి చేశారన్నారు. మంత్రి జూపల్లి అండతోనే కొల్లాపూర్‌లో దాడులకు తెగబడ్డారని ఆరోపించారు.
కొల్లాపూర్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ అండతో క్రైమ్ రేట్ పెరిగిందని, హోంశాఖ కూడా చూస్తున్న సీఎం.. కొల్లాపూర్‌లో జరుగుతున్న ఘటనలపై సమీక్షించాలని బీరం హర్షవర్దన్ రెడ్డి పేర్కొన్నారు. 70 ఏండ్ల మహిళలపైనా దాడి చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు. అంబేద్కర్ చౌరస్తా అంబేద్కర్ సాక్షిగా జరిగిన దాడి దృశ్యాలను, అక్కడ రికార్డైన సీసీటీవీ ఫుటేజ్‌లను టాపరింగ్ చేయకుండా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, లేకపోతే పోలీస్ స్టేషన్ ముందర ధర్నా చేస్తామని హెచ్చరించారు.