Kollapur | కొల్లాపూర్, మార్చి 14 : సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించిన మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్పై భగ్గుమన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కేటీఆర్ పిలుపుమేరకు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆదేశానుసారం శుక్రవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో పట్టణ కేంద్రం ఎన్టీఆర్ చౌరస్తా వద్ద రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. రేవంత్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుతూ.. పవిత్రమైన అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ప్రజా సమస్యలను చర్చించకుండా ఉండేందుకు కోసమే ప్రతిపక్ష పార్టీ నాయకులను సస్పెండ్ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం మొత్తం సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజా సమస్యలను చట్టసభల దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారిని సస్పెండ్ చేయడం సరైనది కాదన్నారు. రేవంత్ రెడ్డి సీఎం హోదా మరిచి వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి బూతు మాటలను విని తెలంగాణ రాష్ట్ర మహిళా లోకం తలదించుకుంటుందన్నారు.
ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేసేందుకే ప్రభుత్వం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుందని వారు గుర్తుకు చేశారు. ఓట్లు వేసిన ప్రజలను మోసం చేయకుండా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టసభలలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల గొంతులను నొక్కిపడితే ప్రజా సమూహంలో గళం విప్పుతామని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా నిరంకుశ విధానాలకు స్వస్తి పలికి ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.