కోస్గి, మే 20 : కోస్గి డిపో నుంచి ప్రతి పల్లెకూ బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కొడంగల్ ప్రజల కల సాకారం కోసమే కోస్గిలో బస్ డిపోను ప్రారంభించామని ఆయన స్పష్టం చేశారు. కోస్గి డిపో పరిధిలో రెండు ఆర్టీసీ బస్సులను, బస్టాండ్‌లో సీసీ పనులను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 30 ఏండ్ల ప్రజల కలను సీఎం కేసీఆర్ నిజం చేశారని తెలిపారు. కోస్గి డిపో ద్వారా ప్రతి పల్లె, గూడేనికి బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఇప్పటివరకు కోస్గి డిపోకు 14 బస్సులు వచ్చాయని.. త్వరలో మరో 14 ప్రైవేటు బస్సులకు టెండర్లు పిలుస్తామన్నారు. అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న కోస్గి బస్టాండ్‌ను కూల్చివేసి రూ.కోటితో నూతన బస్టాండ్‌ను నిర్మించామన్నారు. వానకాలంలో బస్టాండ్ ఆవరణలో వర్షపునీరు నిలువకూడదనే సీసీ వేయిస్తున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని గుర్తుచేశారు. గతంలో కుంటుపడిన అభివృద్ధి.. ఇప్పుడు పరుగులు తీయడానికి బీఆర్ఎస్ పార్టీనే కారణమన్నారు. కార్యక్రమంలో డీఎం ఆంజనేయులు, కోస్గి డిపో ఇన్చార్జి కేవీరెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, కౌన్సిలర్లు, మార్కెట్‌కమిటీ వైస్‌చైర్మన్ వరప్రసాద్ తదితరులున్నారు.