పెంట్లవెల్లి, ఆగస్టు 5 : కొద్ది రోజులుగా మాకు పురుగుల అన్నం పెడుతున్నారు.. ఈ విషయాన్ని ఎస్వో స్వప్న మేడానికి ఫిర్యాదు చేస్తే గిన్నెతో కొట్టారని కస్తూర్బా గాంధీ పాఠశాలల విద్యార్థినులు సోమవారం వారి తల్లిదండ్రులుతో కంటతడి పెట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం రాత్రి నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి కేజీబీవీలో 30 మంది విద్యార్థినులు ఫుడ్పాయిజన్కు గురై తీవ్ర అస్వస్థతకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.. ఈ విషయాన్ని తెలుసుకున్న పలువురు విద్యార్థినుల తల్లిదండ్రులు విద్యాలయానికి చేరుకున్నారు. దీంతో 9వ తరగతికి చెందిన పలువురు విద్యార్థినులు వారి పేరెంట్స్ వద్ద బా ధతో మాట్లాడారు. ‘మాకు ఈ పాఠశాల వ ద్దు.. మీ వెంటే మేము వస్తాం.. అమ్మ..’ అం టూ కన్నీరు పెట్టుకున్నారు.
ఈ దృశ్యం అక్కడున్న వారిని కలిచివేసింది. విద్యార్థులకు కనీసం నాణ్యమైన భోజనం అందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పాలన పేరుతో గద్దెనెక్కిన రేవంత్ సీ ఎం అయ్యాక విద్యాశాఖకు మంత్రిని నియమించలేదని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి విద్యార్థుల బా ధలు అర్థం కావడం లేదా.. అంటూ కన్నెర్ర చేశారు. కాగా కేజీబీవీకి చేరిన మీడియా ముందు మాకు పురుగుల అన్నం, కుళ్లిపోయిన కూరగాయలతో కూర చేసి పెడుతున్నారని వాపోయారు. ఎస్వో దృష్టికి తీసుకెళ్తి నేను పెట్టేది ఇది.. అంటున్నారని అన్నారు. కాగా విద్యాలయ ఎస్వోను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. అందుబాటులో రాలేదు. కాగా ఇన్చార్జిని వివరణ కోరగా తనకేమీ తెలియదని చెప్పింది.