గద్వాల, మే 26 : గద్వాల నుంచి హైదరాబాద్‌కు గులాబీ దండు కదిలింది. తెలంగాణ భవన్లో సోమవారం బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరేందుకు 50 మంది కాంగ్రెస్, బీజేపీకి చెందిన మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు తరలి వెళ్లారు. పార్టీ గద్వాల నియోజకవర్గ నేత బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో సుమారు 100 వాహనాల్లో 800 మంది శ్రేణులు రాజధానికి తరలివెళ్లారు. ఈ సందర్భంగా గద్వాల నోబుల్ స్కూల్ నుంచి వాహన ర్యాలీ ప్రారంభమై గాంధీచౌక్ మీదుగా కృష్ణవేణి చౌక్‌కు చేరింది. అక్కడ జ్వోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కృష్ణవేణి చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది.
అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమం లో బాసు హనుమంతునాయుడు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. రాష్ర్టానికి బీఆర్ఎస్సే శ్రీరామరక్ష అన్నారు. ఎన్నికల ముందు అనేక అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రైతులకు అమలు కానీ హామీ ఇచ్చి మోసం చేశారని, పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా, రైతు భరోసా అందించకుండా రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోసపూరిత మాటలు, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడం ఖాయం అన్నారు.
అనంతరం భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్‌కు తరలివెళ్లారు. కాగా కేటీదొడ్డి మాజీ ఎంపీపీ మనోరమ, ఆమె కుమారుడు చక్రధర్‌రావు, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు రఘురెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, యువజన నాయకుడు చక్రధర్‌రెడ్డి తదితరులు తమ అనుచరులతో కలిసి హైదరాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బాసుశ్యామల, అంగడి బస్వరాజ్, శ్రీరాములు, మోనేశ్, రాజు, తిరుమల్, శేఖర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.