Kodangal Lift | మక్తల్, మార్చి 27 : నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా భూసేకరణకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టులో భూమి కోల్పోయే రైతులకు అధికారులు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా వారికి చేదు అనుభవం ఎదురైంది.
వివరాలలోకి వెళ్తే.. నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా.. మక్తల్ మండలం కాట్రేపల్లి గ్రామంలో ప్రధాన పంప్ హౌస్ నిర్మాణం కోసం 49 మంది రైతులకు సంబంధించినటువంటి 64 ఎకరాల భూమిని తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీంతో మక్తల్ ఆర్ఐ రాములు భూమిని కోల్పోతున్న రైతులకు నోటీసులు ఇవ్వడానికి వెళ్ళగా, ఒకరిద్దరు రైతులు మాత్రమే నోటీసులు అందుకున్నారు. ఇక మిగతా రైతులేవరు రెవెన్యూ అధికారులు అందించే నోటీసులను తీసుకోకుండా తిరస్కరించారు. అధికారులకు ఏం చేయాలో తోచక, ఎర్నాగానిపల్లి గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతుల వివరాలతో కూడిన నోటీసును అతికించి వెనుదిరిగారు. నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ఒక్క ఇంచు భూమి కూడా ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు.
అయితే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఇటీవలే కాట్రేవుపల్లి గ్రామ రైతులతో సమావేశం నిర్వహించి.. సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. రైతుల నుంచి సంతకాల సేకరణ కూడా నిర్వహించారు. సీఎం నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్లలో ఐటీ కారిడార్ నిమిత్తం సేకరించిన భూములకు ఎలాంటి పరిహారం ఇస్తున్నారో.. ఆ మాదిరే కాట్రేవుపల్లి గ్రామ రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని అసెంబ్లీ వేదికగా చర్చించి.. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని వాకిటి శ్రీహరి హామీ ఇచ్చినప్పటికీ.. శాసనసభలో ప్రస్తావనే రాలేదు. దీంతో ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చేంతవరకు నోటీసులు తీసుకునే ప్రసక్తే లేదని, పనులను సైతం అడ్డుకుంటామని రైతులు తేల్చిచెప్పారు.