కల్వకుర్తి రూరల్, ఫిబ్రవరి 6 : కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాకముందు కామారెడ్డి ఇచ్చిన డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం కల్వకుర్తి పట్టణంలోని ఆయన నివాసంలో నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలతో ఈ నెల13న ఆమనగల్లు పట్టణంలో నిర్వహించనున్న రైతుదీక్షకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 420 రోజులు గడిచినా ఆరు గ్యారెంటీలు సమర్థవంతంగా అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వం అనతికాలంలోనే ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలను సైతం అమలు చేసిందని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు మాయ మాటలు చెప్పి కొన్ని పథకాలు అధికారంలోకి వచ్చిన వెంటనే మరికొన్ని పథకాలు వంద రోజులలో అమలుచేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. రైతులకు రుణమాఫీ, రైతుభరోసాలను అందిస్తామని చెప్పి చెల్లించకుండా రైతులను నట్టేటా ముంచారన్నారు. పాడిరైతులకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చెల్లించే పాలబిల్లులను సకాలంలో చెల్లించకుండా ప్రతి లీటర్‌కు రూ.ఆరున్నర తగ్గించి ఐదు పాలబిల్లులు పెండింగ్‌లో ఉంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నిర్వహించిన కులగణన సర్వే ఏమాత్రం పారదర్శకంగా లేదని 52 శాతానికి పైగా ఉన్న బీసీ శాతాన్ని 46 శాతానికి తగ్గించడం సరైంది కాదన్నారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు.
ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీని గద్దె దింపేవరకు పోరాడుతామన్నారు. రైతులను మోసం చేసి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నందున వారికి మద్దతుగా ఆమనగల్లులో ఈ నెల 13న భారీ ఎత్తున రైతు దీక్ష నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారని వెల్లడించారు. కార్యక్రమానికి నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, రైతులు, ప్రజలు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మసత్యం మిషన్‌భగీరథ మాజీ రాష్ట్ర వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, మాజీ జెడ్పీటీసీ విజితారెడ్డి, మాజీవైస్ ఎంపీపీ గోవర్ధన్, పార్టీ మండలాధ్యక్షుడు విజయ్‌గౌడ్, పట్టణాధ్యక్షుడు బావండ్ల మధు, గణేశ్, పరశురాములు తదితరులు ఉన్నారు.