మల్దకల్, డిసెంబర్ 7: మండలకేంద్రంలోని ఆదిశిలాక్షేత్రంలో మంగళవారం అర్ధరాత్రి లక్ష్మీ, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. వేదపండితులు చైతన్యాచారి, సంతాన్ గోపాల్ఆచారి, మధుసూదన్చార్యులు, రమేశ్చార్యుల ఆధ్వర్యంలో ఆగమశాస్త్ర ప్రకారం వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కల్యాణం జరిపించారు. ముందుగా స్వామివారికి గజవాహన సేవ నిర్వహించారు. గ్రామంలోని దశమికట్ట వరకు ఊరేగింపుగా వెళ్లి స్వామివారి లగ్నపత్రికను ప్రజల మధ్య చదివి వినిపించి నిశ్చితార్థం కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం స్వామి పెండ్లికి ప్రతిఒక్కరూ రావాలని ఆహ్వానం పలికారు. దీంతో కల్యాణఘట్టం మొదలైంది. ఆనంతరం ఆలయంలో కనులపండువగా లక్ష్మీ, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణం నిర్వహించారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, రామలసీమ ప్రాంతాలకు చెందిన వేలాదిమంది భక్తులు కల్యాణ వేడుకను తిలకించి పునీతులయ్యారు. అనంతరం ప్రభపై గ్రామంలోని దశమికట్ట వరకు ఊరేగించారు. కల్యాణోత్సవంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఆయన సతీమణి బండ్ల జ్యోతి పాల్గొని స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ముందుగా ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా జెడ్పీ చైర్పర్సన్ సరితాతిరుపతయ్య దంపతులు స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొని తిలకించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్, ఈవో స్వామివారి శేషవస్త్రంతో సన్మానించారు.
కల్యాణోత్సవానికి జిల్లా ప్రజలే కాకుండా వివిధ రాష్ర్టాల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఎస్సై శేఖర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కల్యాణోత్సవం సాఫీగా సాగేలా చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో ఎంపీపీలు రాజారెడ్డి, గట్టు విజయ్‌కుమార్, సింగిల్‌విండో చైర్మన్ తిమ్మారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు వెంకటన్న తదితరులు పాల్గొన్నారు.