కల్వకుర్తి, నవంబర్ 18: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కల్వకుర్తి నియోజకవర్గంలో నవశకం ఆరంభమైంది. అభివృద్ధిలో నియోజకవర్గ రూపురేఖలు మారిపోతున్నాయి. విద్య, వైద్యం, సాగునీరు పరంగా నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. కృష్ణాజలాలు కల్వకుర్తి నియోజకవర్గానికి వచ్చిన క్రమంలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో ప్రగతి నిత్యకృత్యంగా మారింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెరగడంతో ఉపాధి అవకాశాలు చాలా వరకు మెరుగయ్యాయి. ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగింది. దీనికితోడు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుంది.
కల్వకుర్తి వాసుల చిరకాల వాంఛ మహాత్మగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం. కల్వకుర్తి నియోజకవర్గానికి సాగునీరు అందించే ఉద్దేశంలో దాదాపు నాలుగు దశాబ్ధాల క్రితం శిలాఫలకం వేసిన మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడే వరకు కాగితాల మీద రాతలుగానే మిగిలాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్వకుర్తి ఎతిక్తపోతల పనుల్లో వేగం పెరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం సాగుజలాలకు పెద్దపీట వేసిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ పనులు పూర్తయ్యాయి. 2017 నవంబర్‌లో కృష్ణాజలాలు కల్వకుర్తి పోతల కాల్వల ద్వారా పరవళ్లు తొక్కుతూ.. కల్వకుర్తి బీడు భూములను ముద్దాడాయి. గుడిపల్లి గట్టు నుంచి ప్రారంభమైన కేఎల్ఐ 29వ ప్యాకేజీ కాల్వ కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లి వద్ద 160 కిలో మీటర్ల వద్ద ముగిసింది. కల్వకుర్తి మండలం ఎలికట్ట సమీపంలో కేఎల్ఐ కాల్వ ప్రారంభమై జంగారెడ్డిపల్లి వద్ద ముగుస్తుంది. ఈ కాల్వ ద్వారా కల్వకుర్తి మండలంలో దాదాపుగా 37 వేల ఎకరాలకు సాగునీరు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందుతుంది.
కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ, ఆమనగల్లు, మాడ్గుల మండలాలకు సాగునీరు ఇవ్వాలని స్థానిక ప్రజాప్రతినిధుల వత్తిడి మేరకు సీఎం కేసీఆర్ డీ-82 కాల్వకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. దాదాపు రూ.180కోట్లతో 58 కిలో మీటర్ల కాల్వకు నిధులు మంజూరు కావడంతో పనులు పూర్తికావచ్చాయి. 29వ ప్యాకేజీ డీ-82 కాల్వతో కల్వకుర్తి నియోజకవర్గంలో దాదాపు ప్రత్యక్షంగా, పరోక్షంగా 70వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. కాల్వ నీటితో నియోజకవర్గంలోని చెరువులు కృష్ణా సాగుజలాలతో కళకళలాడుతున్నాయి. ఇదేకాకుండా కల్వకుర్తి చుట్టుపక్కల ఏడు మండలాలకు మిషన్ భగీరథ వాటర్‌గ్రిడ్ ద్వారా తాగునీరు అందుతుంది.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలంలోని 8గ్రామాలను విడదీసి ఊర్కొండ మండలంగా ఏర్పాటు చేసింది. అదేవిధంగా అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూర్ మండలంలోని నాలుగు గ్రామాలు, కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలంలోని 4 గ్రామాలను కలిపి చారకొండ మండలంగా మార్చింది. కల్వకుర్తి, వెల్దండ, వంగూర్, చారకొండ, ఊర్కొండ మండలాలను కలిపి కల్వకుర్తి రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశారు.
కల్వకుర్తి రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసిన వెంటనే పోలీస్ డీఎస్పీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం వెల్దండ మండలంలో సీఐ కార్యాలయం ఏర్పాటు చేశారు. కల్వకుర్తి, వెల్దండ సీఐ కార్యాలయాలుగా, కల్వకుర్తి, వెల్దండ, చారకొండ, ఊర్కొండ, వంగూర్ మండలాలతో కూడిన డీఎస్పీ కార్యాలయం కల్వకుర్తిలో ఏర్పాటైంది.
కల్వకుర్తి నియోజకవర్గం(నాగర్‌కర్నూల్, రంగారెడ్డి)రెండు జిల్లాలలో విస్తరించి ఉంది. కల్వకుర్తి, వెల్దండ మండలాలు నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉండగా.., ఆమగనల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాలు రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల పునర్విభజనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆమగనల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాలను రంగారెడ్డి జిల్లాలో కలిపి విప్లవాత్మకమైన మార్పులకు తెరతీసింది. నాలుగు మండలాలు రంగారెడ్డి జిల్లాలో విలీనం చేయడంతో సదరు మండలాలు పట్టణీకరణ వైపు పరుగులు పెడుతున్నాయి. కల్వకుర్తి నియోజకర్గంలో కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా ఆమనగల్లు, తలకొండపల్లి మండలాల నుంచి కొన్ని గ్రామాలను విడదీసి కడ్తాల మండలాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ మధ్యన ఇర్విన్‌ను కొత్త మండలంగా ఏర్పాటు చేసేందుకు వీలుగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
కల్వకుర్తి ప్రస్తుతం గురుకులాలకు హబ్‌గా ఉంది. గతేడాది వెల్దండ మండల కేంద్రంలో ఏవకల్య గురుకుల పాఠశాల ఏర్పాటు కాగా, ఈ సంవత్సరం బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటైంది. దీంతో బీసీ బాలికల పాఠశాల, కళాశాల, బీసీ బా లుర పాఠశాలలు ఉన్నాయి. ఇదేకాకుం డా ఎస్సీ, ఎస్టీ బాలికల, బాలుర గురుకుల పాఠశాల/కళాశాలలతో కొత్తగా మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల/ కళాశాల ఏర్పాటైంది.
కల్వకుర్తి నియోజకవర్గంలో మూడు జాతీయ రహదారులు వెళ్తున్నాయి. హైదరాబాద్- శ్రీశైలం రహదారి(ఎన్‌హెచ్ 365), కోడాద- జడ్చర్ల రహదారి, కొట్ర-నంధ్యాల(167కే) మూడు రహదారులు ఉన్నాయి. 167కే రహదారి పనులు ఈ మధ్యనే ప్రారంభమయ్యాయి. హైదరాబాద్-శ్రీశైలం, కోదాడ, జడ్చర్ల పనులు ఇదివరకే పూర్తయ్యాయి.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఏర్పాటైన కల్వకుర్తి, ఆమనగల్లు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. టీయూఎఫ్ఐడీసీ నిధులు, ఇతర నిధులు దాదాపు రూ.150 కోట్లతో పార్కులు, సీసీరోడ్లు, భూగర్భ మురుగుకాల్వలు పూర్తి చేశారు. చాలా కాలనీల్లో ప్రాధాన్యతా క్రమంలో పనులు వేగవంతంగా సాగుతున్నాయి. కల్వకుర్తి మున్సిపాలిటీకి రూ.2 కోట్లతో కొత్త భవనం ఏర్పాటైంది.
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు కల్వకుర్తి పట్టణంలో వంద పడకల దవాఖాన 20రోజలు కిందట రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఆమనగల్లు మండల కేంద్రంలో 50 పడకల దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కల్వకుర్తి ప్రభుత్వ కమ్యూనిటీ దవాఖానలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. కడ్తాల మండల కేంద్రంలో దాదాపు రూ.1.50 కోట్లతో ఆత్యాధునిక పోలీస్‌స్టేషన్‌ను నిర్మించారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో తడి, పొడి చెత్త వేరు చేసి ఉపయుక్తమైన వస్తువులు, బయోగ్యాస్ తయారు చేసేందు కు సెగ్రిగేషన్ ట్యాంకు, వీధి వ్యాపారుల కోసం 56షెడ్లు నిర్మించారు. ఆమనగల్లు మండల కేంద్రంలో రూ.2కోట్లతో గ్రంథాల య భవనాన్ని ని ర్మించారు. రైతులకు ఉపయుక్తంగా ఉండేందుకు క్లస్టర్లవారీగా రైతువేదికలు, గ్రామగ్రామాన స్మశానవాటిక లు, ఉద్యానవనా లు ఏర్పాటు చేశారు. ఆమనగల్లు సురసము ద్రం మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నా యి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు ఏర్పాటయ్యాయి. కొత్త పంచాయతీల్లో జీపీ భవనాలను నిర్మించారు. తెలంగాణ సిద్ధించాక కల్వకుర్తి నియోజకవర్గంలో దాదాపు రూ.3వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరిగాయి.