జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ‘పర్మినెంట్’ ఆకాంక్ష నెరవేరనున్నది. కొన్నేండ్లుగా ఎదురు చూస్తున్న రెగ్యులరైజ్ను నెరవేరుస్తూ సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. దీంతో గ్రామాల అభివృద్ధిలో కీలకంగా మారిన జేపీఎస్‌లు ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరణకు నోచుకోబోతున్నారు. నాలుగేండ్ల సర్వీస్ ప్రాతిపదికన జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో ఖరారు కానున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వేయి మందికిపైగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.
– నాగర్‌కర్నూల్, జూలై 18 (నమస్తే తెలంగాణ)
నాగర్‌కర్నూల్, జూలై 18 (నమస్తే తెలంగాణ) : జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. గ్రామాల్లో పనిచేస్తున్న జేపీఎస్‌లను క్రమబద్ధీకరించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఆయా కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్పీఎస్సీ-2018 నోటిఫికేషన్ ప్రకారం మెరిట్ మార్కుల ఆధారంగా జేపీఎస్‌లు 2019, ఏప్రిల్ 12న ఉ ద్యోగాల్లో చేరారు. జేపీఎస్‌లకు మూడేళ్ల ప్రొ బేషన్ సర్వీసు పూర్తికాగా, ఏడాది పొడిగిస్తూ 2022జూన్‌లో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కాగా, ఈఏడాది ఏప్రిల్ 11వ తేదీతో నాలుగేండ్ల ప్రొబేషనరీ సర్వీసు కూడా పూర్తైంది. నాటి నుంచి జేపీఎస్‌లు రెగ్యులరైజ్ కోసం ఎ దురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్, రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు రెగ్యులరైజ్‌పై వినతిపత్రాలు అందజేశారు. అయితే రెగ్యులరైజ్ ప్రక్రియ సాంకేతిక కారణాలతో జాప్యం జరగడంతో జేపీఎస్ల్లో ఆందోళన నెలకొం ది. ఈ క్రమంలో నాలుగేళ్ల సర్వీసు పూర్తైన జేపీఎస్‌లను రెగ్యులరైజ్ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో పంచాయతీరాజ్‌శాఖ ఆ దిశగా చర్యలు తీసుకోనుంది.
కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలు..
కలెక్టర్ల ఆధ్వర్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారిలాంటి పలువురు అధికారులతో కూడిన కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఈ కమిటీలు పంపే వివరాల ఆధారంగా జేపీఎస్‌ల రెగ్యులరైజ్ చేపడతారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలు కొద్ది రోజుల్లోనే వెలువడనున్నాయి. కాగా ఇటీవలే రాష్ట్రంలో దాదాపుగా 10వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. ఇదే క్రమంలో తాజాగా వీఆర్ఏలను క్రమబద్ధీకరించేందుకు ఉత్తర్వులివ్వగా, అధికారులు కార్యాచరణ చేపట్టారు. ఇప్పటికే జేపీఎస్‌లపై రెండు నెలల కిందట సీఎం క్రమబద్ధీకరణపై మాట ఇచ్చారు. ఇలా రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థ లేకుండా చేస్తానన్న హామీ అమలు దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టడంలో పంచాయతీ కార్యదర్శులది కీలక పాత్ర. ఇందులో జేపీఎస్‌లు కూడా ఇతర కార్యదర్శుల్లాగే నిరంతరం విధులు నిర్వహిస్తున్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. గ్రామాల్లో పారిశుధ్య చర్యలు మొదలుకొని పన్నుల వసూళ్లు చేపట్టడం, హరితహారం, వన నర్సరీ, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాల నిర్వహణ చేపడుతోంది. ప్రతి సీజన్లో వచ్చే వ్యాధుల అరికట్టడంలో కార్యదర్శులు వైద్య, ఇతర శాఖలకు తలలో నాలుకగా వ్యవహరిస్తున్నారు. వృద్ధులకు పింఛన్లు తీసుకోవడానికి వేలిముద్రలు రాని పరిస్థితుల్లో కార్యదర్శులే డబ్బులు డ్రా చేసి ఇస్తున్నారు. అలాగే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, నర్సరీలు, మొక్కల సంరక్షణ, రైతుబీమా క్లెయిమ్ దరఖాస్తు పత్రాలు, ఇంటి నిర్మాణాలు, లే అవుట్ల అనుమతుల్లాంటి పనులన్నీ ఈ కార్యదర్శులే చేపడుతున్నారు. గ్రామాల్లో స్వచ్ఛ పురస్కారాలకు ఎంపికవడంతో జాతీయ స్థాయిలోనూ రాష్ర్టానికి ఈ ఉద్యోగులు చేస్తున్న కృషి కూడా కారణంగా నిలుస్తోంది. దీంతో ఈ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించేందుకు సీఎం నిర్ణయించారు. దీంతో ఉమ్మడి పాలమూరులో వేయి మందికిపైగా జేపీఎస్‌లు త్వరలో రెగ్యులర్ ఉద్యోగులు కానున్నారు. సీఎం నిర్ణయంతో జేపీఎస్ కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
మార్గదర్శకాల ప్రకారం క్రమబద్ధీకరణ..
ప్రభుత్వం జేపీఎస్‌ల క్రమబద్ధీకరణపై సూత్రప్రాయంగా నిర్ణయించింది. త్వరలో విధివిధానాలను ఖరారవుతాయి. దీని ప్రకారంగా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ జిల్లాలోని జేపీఎస్‌ల రెగ్యులరైజ్‌కు చర్యలు తీసుకుంటుంది. జిల్లాలో 311మంది జేపీఎస్‌లు పని చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు, నిబంధనల ప్రకారం జేపీఎస్‌ల రెగ్యులరైజ్‌కు చర్యలు తీసుకుంటాం.
– మనూచౌదరి, అదనపు కలెక్టర్, నాగర్‌కర్నూల్