మహబూబ్నగర్, జూన్ 24 : తమకు నెలనెలా వే తనాలు ఇస్తేనే ప్రజలకు వైద్యసేవలు అందిస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. సోమవారం మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల, జనరల్ దవాఖానలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు దవాఖాన ఆవరణలో టెంట్ వేసుకొని సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు వేతనాలు చెల్లించే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ నుంచి ప్రభుత్వానికి తమ గోడు వెల్లబోసుకుంటున్నామని, సమ్మె నోటీసులు సైతం ఇచ్చినా ఎలాంటి స్పందన లేదన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమ్మెలో జూనియర్ డాక్టర్లు సాయిరాం, అభిషేక్, తేజశ్రీ, తేజస్సు, సహజ, ప్రణయ్, శృతి తదితరులు పాల్గొన్నారు.