కల్వకుర్తి రూరల్, అక్టోబర్ 8 : ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ఏఐసీసీ జాతీయ నాయకులతో కలిసి ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు అమలు చేయడం లేదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం కల్వకుర్తి పట్టణంలోని ఆయన నివాసంలో కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆయా మండలాల బీఆర్ఎస్ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి మొత్తం కుంటుపడిందని, ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడకుండా నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు.
ఇప్పటికే స్ధానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి ఉంటే కేంద్రం నుంచి నిధులు వచ్చేవని వాటితో గ్రామాల్లో అబివృద్ధి పనులు సాగేవని, నేడు ఆ నిధులు తిరిగివెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు యూరియా కోసం చెప్పులను లైన్లలో పెట్టి ఇబ్బందులు పడుతున్నా ముందు చూపు లేకుండా మాది రైతు సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పది శాతం మిగిలి ఉంటే వాటికి నిధులు విడుదల చేయకుండా పెండింగ్‌లో ఉంచారని ఆరోపించారు.
రాష్ట్ర అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్ తీర్మానం చేసి ఢిల్లీకి పంపితే సరిపోదని రిజర్వేషన్ అమలు కోసం తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఏ విధంగా అయితే నెలల తరబడి ఢిల్లీలో ఉద్యమించి రిజర్వేషన్లు సాధించిందో అలాగే కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో ఉద్యమించాలని సూచించారు. ధరణి పేరును భూభారతిగా మార్చి సీఎం, అతడి సోదరులు, మంత్రులు నాయకులు భూ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారని స్థానిక సంస్థల ఎన్నికల బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఖాయమని అన్నారు. అనంతరం కాంగ్రెస్ ఎన్నికల హామీ బాకీ కార్డులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం మాజీ వైస్ చైర్మన్ షాహెద్, నాయకులు సూర్యప్రకాశ్‌రావు, విజితారెడ్డి, మనోహర్‌రెడ్డి, జంగయ్య, ఎల్ఎన్రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.