పాలమూరు, జూలై 14 : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపం నుంచి శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్రను ఆదివారం వైభవంగా నిర్వహించారు. కొత్తబస్టాండ్, అశోక్‌టాకీస్ చౌరస్తా, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ చౌరస్తా, రాంమందిర్ నుంచి గడియారం చౌరస్తా, తెలంగాణ చౌరస్తా, రైల్వేస్టేషన్ రోడ్ మీదుగా టీటీడీ కల్యాణ మండపం వరకు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రథయాత్ర సందర్భంగా వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.

జగన్నాథుడి నామస్మరణతో పాలమూరు పట్టణం మార్మోగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ డీకే అరుణ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం 56రకాల వంటకాలతో తయారు చేసిన ప్రసాదాన్ని భక్తులకు నిర్వాహకులు అందజేశారు. కార్యక్రమంలో జగన్నాథ రథయాత్ర కమిటీ సభ్యులు యాదిరెడ్డి, రాజమల్లేశ్, ఉదయశ్రీ, వినయ్‌కుమార్, కొండన్న, మల్లారెడ్డి, హేమసుందర్‌రెడ్డి, సుధాకర్, నత్మల్ఝంవార్, రఘు, భజన మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.