వంగూరు, ఏప్రిల్ 11 : పాలమూరు రైతులకు నష్టం కలిగించే డిండి ఎత్తిపోతలను రద్దుచేయాలని ఉమ్మడి జిల్లా జేఏసీ అధ్యక్షుడు రాజేందర్రెడ్డి, పాలమూరు అధ్యాయన వేదిక కన్వీనర్ రాఘవాచారి డిమాండ్ చేశారు. వంగూరు మండలంలోని ఉల్పర నుంచి డిండి-చింతపల్లి వరకు డీఎల్ఐ కాల్వను శనివారం జేఏసీ బృందం పరిశీలించింది. అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భూములు కోల్పోయేది పాలమూరు రైతులు, నీళ్లు పారేది నల్గొండకైతే ఇక్కడి పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పర్యావరణ అనుమతులు, డీపీఆర్ లేకుండా ప్రాజెక్టు ఎలా చేపడుతారని వారు మండిపడ్డారు.
నల్గొండకు చెందిన ఇంజినీర్లు ఈ ప్రాంతం పూర్తిగా నష్టం కలిగించేలా కుట్రలు చేశారన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల కింద సాగుకు అనుకూలమైన భూములు డిండి ఎత్తిపోతలకు తీసుకొని రైతులను నిండా ముంచిందని వారు పేర్కొన్నారు. ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తే సీఎం అయి ఉండి పట్టించుకోకపోవడం ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు. డీఎల్ఐని రద్దు చేయడంతోపాటు ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు ఉద్యమం ఉధృతం చేస్తామని వారు పేర్కొన్నారు.