మహబూబ్‌నగర్ విద్యావిభాగం, అక్టోబర్ 25 : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డలో ఉన్న ప్రభుత్వ బాలికల ఐటీఐ కళాశాల ఆవరణలో శుక్రవారం బాలురు, బాలికల సమీకృత అధునాతన సాంకేతిక కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన, డైట్ కళాశాలలో టాస్క్ స్థల పరిశీలన, మధురానగర్‌లోని రెడ్డి హాస్టల్లో మహబూబ్‌నగర్ ఫస్ట్ శిక్షణ కార్యాలయం, నవరత్నాలు వంటి తదితర కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంక్యుబేషన్ సెంటర్‌కు అనుగుణంగా ప్రతి యూనివర్సిటీకి ఒక ఇండస్త్రీని అటాచ్ చేసేందుకు కృషిచేస్తున్నామన్నారు. పీయూలో సాంకేతికపరమైన ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రాథమికంగా ఉన్న ఆలోచనలను సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుతోపాటు కొత్తగా ఏదైనా చేసేందుకు సైన్స్ సెక్టార్‌కు సంబంధించి ఈ సెంటర్ దోహదపడుతుందన్నారు. మానవ వనరులను అందిపుచ్చుకొని ప్రపంచస్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో టాటా టెక్నాలజీస్ సంస్థ ద్వారా రూ.2,200 కోట్లతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.400 కోట్లు వెచ్చించి రాష్ట్రవ్యాప్తంగా 65 ఐఐటీలను ఏటీసీలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో రూ.68 కోట్లతో ఏటీసీ భవనాలను నాలుగు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్‌లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుబంధంగా జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోనే మొదటిసారిగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో స్కిల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఏర్పాటు చేయనున్న హబ్ఇన్స్పోక్లో వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలు కల్పిస్తామన్నారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు బ్యాంకింగ్ ఫైనాన్సియల్ రంగంలో ఇంటర్న్‌షిప్ ఇచ్చి.. అది పూర్తయ్యే నాటికి ఉద్యోగావకాశాలు కల్పించే కార్యక్రమాన్ని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ప్రారంభించినట్లు తెలిపారు. మక్తల్ నియోజకవర్గంలో పారిశ్రామిక వాడల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ విజయేందిరబోయిని కోరారు. ప్రజాపాలన ప్రభుత్వం రూ.17 వేల కోట్లతో రూ.1.50 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేశామని, అతి త్వరలో రూ.2 లక్షల రుణం ఉన్న వారికి మాఫీ చేస్తామన్నారు.
అనంతరం దివిటిపల్లి వద్ద ఉన్న ఐటీ టవర్‌ను సందర్శించారు. స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని అమరరాజా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. రైతులకు పూర్తిస్థాయిలో భూసేకరణ పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శ్రీహరి, శంకర్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లాకొత్వాల్, కలెక్టర్ విజయేందిరబోయి, అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనిత, ఐటీఐ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ శాంత య్య, , ఆర్డీవో నవీన్, తాసీల్దార్ ఘాన్సీరాం పాల్గొన్నారు.