యాసంగి పంటలకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేసవి ప్రారంభంలోనే సాగు, తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. చెరువులు, కుంటలు అడుగంటు తుండగా.. కాల్వలు వెలవెలబోతున్నాయి. బోరుబావుల్లో భూగర్భ జలాలు పడిపోయాయి. దీనికి తోడు పలు చోట్ల కరెంట్ సమస్యలు వేధిస్తుండడంతో రైతుల బాధలు వర్ణణాతీతం. రెక్కలు ముక్కలు చేసుకొని.. వేల రూపాయాలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు కండ్ల ముందే ఎండుతుండడంతో చూసిన కర్షకుల గుండె బరువెక్కుతున్నది.
– నెట్వర్క్ మహబూబ్‌నగర్, మార్చి 24
నవాబ్‌పేట, మార్చి 24 : కాంగ్రెస్ హయాంలో రైతులకు కన్నీటి కష్టాలు ఎదురవుతున్నాయి. బోరుబావులు, చెరువులు, కాల్వలు వట్టిబోవడంతో ఎక్కడికక్కడ పంటలు ఎండుతున్నాయి. వీటిని చూసిన రైతు గుండెకు కోతలే మిగులుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం పల్లెగడ్డ గ్రామానికి చెందిన రైతు ఈసూరి యాదయ్య రెండు నెలల కిందట మూడున్నర ఎకరాల్లో వరి సాగు చేశాడు. పంట చేతికందే దశలో భూగర్భ జలాలు అడుగంటడంతో ఆందోళన చెందాడు.
పంటను ఎలాగైనా కాపాడుకోవాలన్న తాపత్రయంతో తన పొలంలో సోమవారం ఒకే రోజు రెండు బోర్లు వేశాడు. ఒక చోట 300 ఫీట్ల వరకు బోరు వేసినా నీళ్లు పడలేదు. దీంతో మరోచోట 200 ఫీట్లు బోరు డ్రిల్ చేయించాడు.. అయినా చుక్క పడలేదు. కష్టం ఉట్టిగనే పోగా.. పైగా బోర్ల కోసం తెచ్చిన రూ.1.20 లక్షల అప్పు మీద పడిందని రైతు దిగాలు చెందుతున్నాడు. ఓ పక్క ఆరుగాలం కష్టపడి పండించిన పొలం ఎండుతుంటే.. మరో పక్క రెండు బోర్లు వేసినా నీళ్లు రాకపోవడంతో రైతు ఆవేదన వర్ణణాతీతం.
ధన్వాడ, మార్చి 24 : ధన్వాడ మండల కేంద్రానికి చెందిన రైతు సందరాజు ఐదెకరాల్లో రెండు బోర్లల్లో నీళ్లు పుష్కలంగా ఉండడంతో మూడెకరాల్లో వరి పంట సాగు చేశాడు. మిగిలిన రెండెకరాలు బీడుగా ఉంచాడు. పంటలు పొట్ట దశ నుంచి చేతికొచ్చే సమయంలో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో ఒక్కసారిగా బోర్లు వట్టిబోయాయి. దీంతో రైతుకు ఏం చేయాలో పా లుపోలేదు. పంటలు వాడుపడుతుండడంతో ఎలాగైనా కాపాడుకోవాలన్న తాపత్రయంతో తెలిసిన షావుకారి వద్ద రూ.లక్ష అప్పు తెచ్చాడు.
వారం వ్యవధిలో పొలంలో వేర్వేరు చోట్ల మూడు బోర్లు వేశాడు. అయినా చుక్క నీరు పడలేదు. నీళ్లులేక పంట ఎండిపోతున్నది. సాగుబడుల కోసం తెచ్చిన అప్పు రూ.లక్ష, బోర్ల కోసం తెచ్చిన మరో రూ.లక్ష మొత్తం 2 లక్షలు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదని ఆందోళన చెందుతున్నాడు. ఎండిన పంటల ను అధికారులు పరిశీలించి నష్టపరిహారం అం దించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. మిగితా రైతులకు సర్కారు అండగా నిలబడాలన్నారు.
హన్వాడ, మార్చి 24 : మండలంలోని నాయినోనిపల్లి గ్రామ సమీపంలో ఉన్న పబ్బన్నకుంట కింద రైతులు వరి పంట సాగు చేశారు. అయితే కొద్ది మంది రైతులు తమ పంటల కోసం ఎలాంటి అనుమతి లేకుండా ఇష్టానుసారంగా కుంట నుంచి బోర్ల ద్వారా నీటిని తోడుకుంటున్నారు. అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. అయితే కుంటలో నీరు లేకపోతే ఎండకాలం మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. అంతేకాకుం డా చుట్టుపక్కల ఉన్న బోర్లలో సైతం నీటిమట్టం తగ్గే అవకాశం ఉందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి అక్రమంగా నీటిని తోడుకుంటున్న రైతులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.