గద్వాల, డిసెంబర్ 6 : యాసంగిలో పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం తీపి క బురు అందించింది. సాగయ్యే పంటలకు సాగునీరు అందించాలని రాష్ట్ర స్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. నీటి పారుదల శాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్ అధ్యక్షతన మంగళవారం జలసౌధలో సమావేశమైన కమిటీ ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత ఎగువ నుంచి రానున్న ప్రవాహాన్ని అంచనా మేరకు నిర్ణయించారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కింద యాసంగిలో సుమారు 79,550 ఎకరాలకు సాగునీరు అందనున్నది. దీంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడా ది వానకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో జిల్లాలోని జూరాల, నెట్టెంపాడ్, ఆర్డీఎస్ ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నా యి. ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల్లో ఉన్న నీటి లభ్యత ఆధారంగా ప్రభుత్వం యాసంగి పంటలకు నీళ్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది.
గత యాసంగి సీజన్లో వర్షాలు అనుకున్న స్థాయిలో కురవక పోవడంతో ప్రాజెక్టులు నీళ్లులేక వట్టిబోయాయి. ఎగువన ఉన్న అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల్లో నీరులేక పోవడంతో ఆ ప్రాజెక్టుల కింద పంటలకు క్రాప్‌హాలీడే ప్రకటించారు. జిల్లాలో ఉన్న జూరాల, నెట్టెంపాడ్ పరిధిలోని గుడ్డెందొడ్డి, ర్యాలంపాడ్ రిజర్వాయర్‌లో నీరు ఇంకిపోవడంతో 15 ఏండ్ల తర్వాత మొదటిసారి గతేడాది యాసంగిలో జిల్లాలోని రైతులు పంట లు సాగు చేయక క్రాప్ హాలీడే ప్రకటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాదిలోనే వర్షాలు కురువకపోవడం రైతులు ఇబ్బందులు పడ్డారు. దీనితోడు వానకాలం సీజన్‌కు సంబంధించి రైతులకు ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకపోవ డం.. యాసంగి సీజన్లో క్రాప్ హాలీడే ప్రకటించడంతో కర్షకులు ఆందోళన చెందారు. ప్రస్తుత వానకాలం సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురవడంతోపాటు పంటలు బాగా పండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సంతోషంలో యాసంగిలో కూడా పంటలకు నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో రైతులు యాసంగి సాగుకు సిద్ధమవుతున్నారు.
రాష్ట్రస్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీలో జిల్లాలోని ప్రాజెక్టుల వారీగా ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించనున్నారో వివరాలను అధికారులు వెల్లడించారు. జూరాల ప్రాజెక్టు కుడి కాల్వ ద్వారా 15 వేల ఎకరాల కు.. నెట్టెంపాడ్ ప్రాజెక్టు (గుడ్డెందొడ్డి, ర్యాలంపాడ్)పరిధిలో 24,800 ఎకరాలకు, ఆర్డీఎస్ పరిధిలో 37 వేల ఎకరాలకు, ఎత్తిపోతల పథకాల కింద 2,750 ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. 2024లోని డిసెంబర్ 25 నుంచి 2025 మార్చి 15వ తేదీ వరకు నీటిని విడుదల చేయనున్నట్లు కమిటీ వెల్లడించింది. దీంతో ఈ యాసంగి పంటలకు సాగునీటికి ఢోకా ఉండదు. అందు కే ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలని రైతులకు అధికారులు సూచించారు.