మహబూబ్‌నగర్ కలెక్టరేట్, మే 20 : జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల భూ సేకరణ, పునరావాస పనులు వేగవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి జి.రవినాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం (కలెక్టరేట్)లోని వీసీహాల్లో కలెక్టర్ విజయేందిరబోయితో కలిసి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణం, భూ సేకరణ, ఆర్అండ్ఆర్ పనులను, కోయిల్‌సాగర్, మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకాల భూసేకరణపై ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్, మిషన్ భగీరథ, సర్వేల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులతో సమీక్షించారు.
నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం, కల్పిస్తున్న సౌకర్యాలు వసతులకు సంబంధించిన వివరాలు సేకరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మోహన్‌రావు, సాగునీటి పారుదలశాఖ చీఫ్ ఇంజినీర్ రమణారెడ్డి, ఎస్ఈ చక్రధరం, ఆర్డీవో నవీన్, సర్వే ఏడీ కిషన్‌రావు, మి షన్ భగీరథ(ఇంట్రా) ఈఈ పుల్లారెడ్డి పాల్గొన్నారు.