మహబూబ్‌నగర్, నవంబర్ 23 : పాడి పరిశ్రమను పెంచేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందిస్తున్నది. వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో జీవాలను పెంచుతున్న వారు షెడ్లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ అందజేస్తున్నది. అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గిరిరాజ కోళ్లు, పందులు, గొర్రెలు, మేకలను పెంచేందుకుగానూ షెడ్లను ఏర్పాటు చేసుకునేందుకురూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు రుణాలను అందించనున్నది. 50 శాతం సబ్సిడీ పోను మిగిలిన మొత్తం బ్యాంక్ ద్వారా రుణం తీసుకునే అవకాశం కల్పించింది.
గిరిరాజ కోళ్లు, నాటు కోళ్ల షెడ్డు ఏర్పాటుకు ప్రభుత్వం రూ.50 లక్షల రుణం అందించనున్నది. ఇందులో రూ.25 లక్షలు సబ్సిడీపోను మిగిలిన రూ.25 లక్షలు లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. పందుల షెడ్డు కోసం రూ.60 లక్షలు, గొర్రెల షెడ్డుకు గరిష్ఠంగా రూ.కోటి రుణం అందించనున్నది. రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే ఆర్థికంగా అభివృద్ధి చెందొచ్చు. అయితే, షెడ్ల ఏర్పాటు కోసం ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మండల పశువైద్యాధికారిని కలిసి చేయాలనుకున్న ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేసి రిపోర్టు తీసుకోవాలి. షెడ్డు ఎక్కడ నిర్మిస్తున్నారు.. ఎంత ఖర్చు అవుతుంది..? అనే విషయాలను పశు వైద్యాధికారి పరిగణలోకి తీసుకొని రిపోర్టు ఇస్తారు. ఈ రిపోర్టుతోపాటు సంబంధిత పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఇప్పటివరకు మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 70 మంది రైతులు వివిధ యూనిట్లకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి..
ఎన్ఎల్ఎం పథకం కింద గిరిరాజకోళ్లు, పందులు, గొర్రెలు, మేకల షెడ్లతోపాటు వివిధ యూనిట్లు అం దుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం యూనిట్ విలువలో 50 శాతం సబ్సిడీ ఇస్తున్నది. మండల పశువైద్యాధికారిని సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవాలి. యూనిట్‌కు సంబంధించిన రిపోర్టును తయారుచేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం నుంచి వచ్చిన సబ్సిడీ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుంది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలి.
– మధుసూదన్‌గౌడ్, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి, మహబూబ్‌నగర్