జడ్చర్ల, జూన్ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జడ్చర్లలో (Jadcherla) ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం ఫ్లైవాక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ సీ. లక్ష్మారెడ్డి, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా అనేది ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఒక ఆధ్యాత్మిక, శారీరక సాధన అన్నారు. ఇది శరీరం, మనస్సు, శ్వాసను కలిపి మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించడంపై దృష్టి పెడుతుందన్నారు. టెక్నాలజీ పెరడంతో పని తగ్గిందని, తద్వారా రోగాలు పెరుగుతున్నాయన్నాయని చెప్పారు. ప్రతిరోజు యోగ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రోగాలు తగ్గుతాయని తెలిపారు. పంచభూతాలు మన శరీరంలో సక్రమంగా పని చేసినప్పుడే రోగం మన దరిచేరకుండా ఉంటుంది, మానసిక ఒత్తిడి దూరమవుతుందని వెల్లడించారు. శ్వాస వ్యాయామాలు మనస్సును శాంతపరచడానికి, శరీరంలో శక్తి ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయన్నారు.
ధ్యానం మనస్సును కేంద్రీకరించి, అంతర్గత శాంతిని మరియు స్పష్టతను సాధించడానికి తోడ్పడుతుందని చెప్పారు. యోగా ఒత్తిడిని, నిద్రలేమి సమస్యలను తగ్గించి మంచి నిద్రను ప్రోత్సహిస్తుందన్నారు. యోగా సాధన వల్ల అంతర్గత శాంతి, సంతృప్తి మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పుష్పలత, కౌన్సిలర్ ప్రశాంత్ రెడ్డి, సతీష్ నవనీత కొండల్, సారిక రామ్మోహన్, బీఆర్ఎస్ నాయకులు యాదయ్య, రఘుపతి రెడ్డి, ఫ్లైవాక్ అసోసియేషన్ సభ్యులు కాల్వ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.