బాలానగర్/దేవరకద్ర రూరల్(చిన్నచింతకుంట), అక్టోబరు 11 : రాష్ట్రంలో పేద విద్యార్థులందరికీ మెరుగైన విద్యను అందించాలనే ల క్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల రూపకల్పనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారని రోడ్లు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బాలానగర్ మండలం పెద్దాయపల్లి శివారులోని 18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శుక్రవారం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మా ట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 28 నియోజకవర్గాల్లో శుక్రవారం 28 ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తుందన్నారు.
ప్రతి నియోజకవర్గంలో 25ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.వందకోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ విద్యార్థులకు 4నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణాలు చేపడుతుందని, క్రీడాస్థలాలు, లైబ్రరీలు, ఈతకొలనులు తదితర అన్నిరకాల సౌకర్యాలతో ప్రైవేటు విద్యా సంస్థలకు తీసిపోని విధంగా పాఠశాల నిర్వహణ సాగుతుందని వివరించారు. అనంతరం చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామ శివారులో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో కలిసి యంగ్ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి, జెడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, ఆర్అండ్బీ డీఈఈ సంధ్య, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మాజీ ఎమ్మెల్యేలు స్వర్ణమ్మ, సీతమ్మతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.