పై ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు బాలమణి. మదనాపురం మండలం దంతనూరు గ్రామం. ఈమె నాలుగు నెలల కింద ఇందిరమ్మ ఇల్లు పునాది నిర్మించుకున్నది. కచ్చితంగా ఇల్లు కట్టుకోవాలన్న లక్ష్యంతో ఉండడంతో అన్నింటిని సిద్ధం చేసుకున్నది. వీరి కుటుంబంలో మొత్తం 8మంది రెండు రేకుల షెడ్లలో ఉంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందామని ఆశపడితే, ఎప్పుడడిగినా బిల్లు వస్తుందని చెబుతున్నారు తప్పా ఇవ్వడం లేదు. కట్టుకుంటే తక్షణమే బిల్లు ఇస్తామని చెబుతున్న అధికారులకు ఈ బాలమణి ఇంటి నిర్మాణం ఎందుకు కనిపించడం లేదో వారికే తెలియాలి.
వనపర్తి, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : దంతనూరు పైలట్ ప్రాజెక్టు గ్రామంలో 61మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరైతే, కేవలం ఇప్పటి వరకు 15మంది మాత్రమే బేస్మెంట్ వరకు నిర్మాణం చేసుకున్నారు. వీరిలో మరో 10మంది తమకు ఇల్లు వద్దని గ్రామ కార్యదర్శికి పత్రాలు రాసిచ్చారు. మార్కవుట్ ఇచ్చినా నాలుగు నెలలుగా 9మంది ముందుకు రావడం లేదు. ఇంకాను 27మంది ఎటు పోవాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. అధికారులు వెంట పడిన కదలడం లేదంటే, వీరు కూడా వెనకిబాట పట్టినట్లుగా అంచనా వేస్తున్నారు.
ఇది ఫైలట్ ప్రాజెక్టులోని ఒక గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ సమాచారం ఇది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం కాంగ్రెస్ ప్రభు త్వం ఫైలట్ ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకు గత జనవరి 26ను ముహూర్తంగా నిర్ణయించి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే.. ప్రచారం జరిగినంత వేగంగా పథకం ముందుకు వెళ్లడం లేదు. ఎన్నో ఆశలతో మొదలు పెట్టిన ఈ ఇండ్ల ప్రాజెక్టు ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లు జిల్లాలో కొనసాగుతుంది. మంజూరైన వాటిలో కనీసం సగం వరకైనా ముందుకు సాగకపోవడంతో లోపం ఎక్కడుం దీ అన్న అనేక ప్రశ్నలు మొదలవుతున్నాయి.
జిల్లాలో ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎంపిక చేశారు. జిల్లాలోని 15మండలాల్లో 15గ్రామాలు ఈ లెక్కన గుర్తింపులోకి వచ్చాయి. ప్రారంభంలో ఇబ్బడి ముబ్బడిగా ఇండ్ల నిర్మాణాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. తీరా చివరి దశకు వచ్చే సగానికి సగం దరఖాస్తుదారులు కూడా నిర్మాణాలకు ముందుకు రాలేదు. నిబంధనలకు సరిపోని కొన్ని దరఖాస్తులను అధికారులు కూడా తొలగించారు. దీంతో చాలా వరకు ఇండ్లు నిర్మాణాలు చేసుకునే వారి సంఖ్య తగ్గిపోయింది. ఇలా జిల్లాలో ఫైలట్ ప్రాజెక్టు కింద మొదటి దశలో 1209 ఇండ్లను ప్రభు త్వం మంజూరు చేసింది.
పైలట్ ప్రాజెక్టు కింద మంజూరు చేసిన ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి ఇప్పటి వరకు 40శాతం కూడా మార్కవుట్లు దాటలేదు. ఈ పరిస్థితులకు కారణాలనేకం ఉన్నప్పటికీ ప్రధానంగా లబ్ధిదారులు ముందుకు రావ డం లేదని, వచ్చిన వారికి అధికారుల సహకారం అంద డం లేదన్న వాదనలున్నాయి. 1210 ఇండ్లు మంజూరైతే.. ఇప్పటి వరకు 480 ఇండ్లకు మార్కవుట్ ఇచ్చా రు.
వీటిలోనూ చాలా మంది పనులను మొదలు పెట్టలేదు. ఫైలట్ ప్రాజెక్టు కింద గుర్తించిన గ్రామాల పరిస్థితి ఇలా ఉంటే, రెండో దఫాలో మంజూరైన ఇండ్ల పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇలా ఇందిరమ్మ ఇండ్ల ఫైలట్ ప్రాజెక్టు అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్లడం లేదని బహిరంగంగానే విమర్శలు వెలువడుతున్నాయి. అధికారులు చొరవ తీసుకుంటే తప్పా లబ్ధిదారులు ముందుకొచ్చే పరిస్థితి లేదు.
ఇందిరమ్మ ఇండ్లు మాకొద్దని జిల్లాలో 80మందికి పైగా అధికారులకు ద్రువపత్రాలు రాసిచ్చారు. ఇల్లు కావాలని ఆశపడినా చివరకు త మకు వద్దని అధికారులకు చెప్పేశారు. ముందు నుంచి ఇం డ్ల నిర్మాణాలపై జనం ఆసక్తి చూ పడం లేదు. నిబంధనలు కఠినంగా ఉండడంతో చాలా మంది వెనుదిరుగుతున్నారు. అధికార పార్టీ నాయకులు ఇచ్చిన భరోసాతో చాలా మంది ఇండ్లను నిర్మించుకొని అవస్థలు పడుతున్నారు.
ప్రస్తుతం ఉన్న నిబంధనలు సరిపోనందున చాలా మంది ఆశావాహులు నిరుత్సాహానికి గురవుతున్నారు. చాలా వరకు మం జూరు ఉండడం.. మార్కవుట్లకు ముందుకు రాకపోవడం.. అధికారుల ఒత్తిళ్లతో ఎటు తేల్చుకోలేక ఇల్లు మాకొద్దని పత్రాలు రాసిచ్చి వెళ్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు పైలట్ ఫ్రాజెక్టులో 480 మంది మార్కవుట్లు వేసుకోగా, 260 మంది బేస్మెంట్, మరో 71 మంది రెంటల్ లెవల్,
22 మంది చెత్తు బిల్స్ తీసుకున్నారు.
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచుతాం. పైలట్ ప్రాజెక్టులో ఉన్న గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. నిర్మాణాలను త్వరగా చేపట్టాలని చెబుతున్నాం. కొందరు చేపడుతున్నారు. మరికొందరు ముందుకు రావడం లేదు. దాదాపు 80మంది వరకు తాము నిర్మాణాలు చేసుకోలేమని పత్రాలను ఇచ్చారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని పేద ప్రజలు ఉపయోగించుకోవాలి. నిబంధనల ప్రకారం నిర్మాణం చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు. గతంలో సిబ్బంది కొరత కూడా ఉండేది. ప్రస్తుతం కొత్త ఏఈలు రావడం వల్ల మా వైపు నుంచి ఎలాంటి సమస్య లేకుండా పనిచేస్తాం.
– విఠోబా, డీఈ, జిల్లా హౌసింగ్ శాఖ, వనపర్తి