కోడేరు, మే 4 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు మూడుగులు ముందుకు.. ఏడడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. మొదటి విడుతలో ప్రయోగాత్మకంగా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పస్పుల, చంద్రబండతండా, అమరగిరి, ఎంగంపల్లితండాను పైలట్ గ్రామాలుగా ఎంపిక చేసింది. మంజూరు చేసిన ఇళ్లలో సగం కూడా ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. మొదటి విడత గడువు సమీపిస్తున్నా రెండు, మూడు రోజుల్లో రెండో విడుత జాబితా సిద్ధం కానున్నది. మొత్తం 132 ఇండ్లు మంజూ రు చేశారు.
కోడేరు మండలం పస్పులలో 40ఇండ్లకు కేవలం ఎనిమిదింటికి మాత్రమే బిలుల్లు మంజూరు చేశారు. స్థలాలున్న లబ్ధిదారులను ఎల్-1లో ఎంపిక చేయగా, ఇప్పుడున్న ఇండ్లను కూల్చితే వర్షాకాలంలో ఎక్కడ ఉండాలనే సంశయంతో ఆసక్తి చూపడం లేదు. సొంత ఖర్చులతో నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేకనే ఇన్నాళ్లు నిర్మాణానికి ముందుకు రాలేదని, సర్కారిచ్చే సాయం విడుతలుగా అది కూడా సరిగా అందించకపోతే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
దీంతోపాటు ఇసుక కొరత కారణంగా ఇండ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదు. 400-600 చదరపు అడుగుల్లోపు ఇళ్లు నిర్మించాలనే నిబంధన అడ్డంకిగా మారిందని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. పెద్ద కుటుంబాలకు సైతం సడలింపు ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టు గ్రామాల్లో మినహా మిగతా లబ్ధిదారుల ఎంపికను మే5వ తేదీలోగా పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. ఇందులోనూ అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.