మూసాపేట : ఇందిరమ్మ ఇండ్ల ( Indiramma House ) నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేస్తే సకాలంలో బిల్లులు అందజేస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ( MLA Madhusudhan Reddy ) చెప్పారు. బుధవారం మూసాపేట రైతు వేదికలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ మొత్తం 3,500 ఇండ్లు మంజూరు అయ్యాయని వివరించారు. ఇల్లు పూర్తి చేసిన వెంటనే మరో వెయ్యి ఇండ్ల మంజూరుకు ప్రయత్నిస్తానని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి విడతల విరివిగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. అందులో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 10 లక్షల ఆరోగ్య శ్రీ, రూ. 500 లకే సిలిండర్, రూ. 2 లక్షల రుణమాఫీ, సన్న బియ్యానికి రూ. 500 బోనస్ ఇస్తున్నామని పేర్కొన్నారు. మూసాపేట్ మండలానికి చెందిన వివిధ గ్రామాలకు చెందిన 255 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. అనంతరం హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, నాయకులు పొల్గొన్నారు.