అలవికాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్.. అమలు చేయలేక పది నెలలు గడిచింది. అడపాదడపా ప్రవేశపెట్టిన పథకాలే అనేక కొర్రీలతో అసంపూర్ణంగా మారగా.. ఇందిరమ్మ ఇండ్ల పేరిట మరో కొత్త మోసానికి
తెరలేపింది. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తూ ఇందులో ప్రముఖంగా కాంగ్రెస్ నాయకులనే కమిటీ సభ్యులుగా తీసుకుంటూ అక్రమాలకు ఆజ్యం పోస్తున్నది.
కాగా, కమిటీల ఎంపికలో పలు చోట్ల కాంగ్రెస్ నేతల మధ్యే పోటాపోటీ నెలకొన్నది. వనపర్తిలో మేఘారెడ్డి, చిన్నారెడ్డి.., గద్వాలలో బండ్ల, సరిత వేర్వేరుగా లిస్టులు రూపొందించి అధికారులకు ఇచ్చారు. అలంపూర్‌లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే విజయుడు ఉన్నప్పటికీ.. సంపత్‌కుమార్ లిస్టును తీసుకోవాలని అధికారులకు హుకుం జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల స్కీంలో అనేక అక్రమాలు చోటు చేసుకోగా.. కొత్తగా మరోసారి కుచ్చుటోపీ పెట్టి దోపిడీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నదనే విమర్శలు లబ్ధిదారుల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
గద్వాల, అక్టోబర్ 16 : జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇందిరమ్మ కమిటీల ఎంపికలో కాంగ్రెస్ నాయకుల మధ్య కుమ్ములాట మొదలైంది. రాజకీయ జోక్యానికి ఆస్కారం ఉం డడంతో కమిటీల ఏర్పాటుపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎటువంటి ఇబ్బందులు లేకున్నా ఓడిపోయిన చోట, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలస వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో రెండు వర్గాలు గా జాబితాలు తీసుకొని కలెక్టర్‌కు పంపిస్తున్నారు. అలంపూర్ నియోజకవ ర్గంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే విజయుడు, కాంగ్రెస్ నుంచి బ రిలో నిలిచి ఓడిపోయిన సంపత్‌కుమార్ మధ్య వార్ నడుస్తున్నట్లు తెలిసింది.
ఇద్దరు కూడా జాబితాలు తయారు చేసి ఎంపీడీవో, కమిషనర్లకు అందజేశారు. దీంతో అధికారులు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలంలో ఎమ్మెల్యే, కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచి ఓడిపోయిన సరిత వర్గం కూడా కమిటీలకు సంబంధించి ఇ ద్దరూ వేర్వేరుగా జాబితా ఇచ్చినట్లు తెలిసింది. ఇందిర మ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో కమిటీలే కీలక పా త్ర పోషిస్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లల్లో అనేక అక్రమాలు చోటుచేసుకోవడంతో గత ప్రభుత్వం ఆ పథకా న్ని రద్దు చేసింది. జిల్లాలో 255 జీపీలతోపాటు నాలుగు బల్దియా ల్లో 77 వార్డులున్నాయి.
మహబూబ్‌నగర్, అక్టోబర్ 16 (నమ స్తే తెలంగాణ ప్రతినిధి) : ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఆరు గ్యారెంటీల్లో ఏ పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకపో గా, కొత్తగా ఇందిరమ్మ ఇండ్ల పేరిట ప్రజలను మరోసారి బురిడీ కొట్టించేందుకు సమాయత్తమవుతున్నది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తూ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఉ మ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాల్లో 42వేల ఇండ్లు మంజూరు కానున్నాయి. అయితే ఇక్కడే అసలైన మెలికే పెట్టింది.
పూర్తిస్థాయిలో లబ్ధిదారుల ఎంపికలు ఇందిరమ్మ కమిటీలతో నిర్వహించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ నాయకులను ఈ కమిటీల్లో నియమించి తమ కార్యకర్తలకు ఇ ల్లు దక్కేలా ప్లాన్ రెడీ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఎమ్మెల్యేలు సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కమిటీల ఎంపిక నిర్వహిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 454 గ్రామ పంచాయతీలకు ఇప్పటివరకు కేవలం 150 గ్రామపంచాయతీలకు మాత్రమే కమిటీలను ఎంపిక చేశారు. మిగ తా చోట్ల కమిటీల ఎంపిక జరుగుతోంది. మ హబూబ్‌నగర్ మున్సిపాలిటీలో 49 వార్డులకు సగం వార్డులను ఎంపిక చేశారు. భూ త్పూర్, జడ్చర్ల మున్సిపాలిటీలో కమిటీల ఎంపిక సాగుతోంది.
ప్రతి నియోజకవర్గానికి కేటాయించిన ఇం దిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయడంలో కాంగ్రెస్ నాయకులు ఉండడం విమర్శలకు తావిస్తున్నది. అధికారులను ఉత్సవ విగ్రహాలుగా పెట్టి మొత్తం కమిటీ సభ్యులతో ఎం పిక ప్రక్రియ చేయించాలని సదరు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. మంచి పట్టున్న కాం గ్రెస్ నేతలను సభ్యులుగా తీసుకోవాలని ఎ మ్మెల్యేలు సిఫార్సు చేస్తున్నారు. కాగా, అ లంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి గె లుపొందిన ఎమ్మెల్యే విజయుడు ఉండగా, మాజీ ఎమ్మెల్యే సంతప్‌కుమార్ చెప్పినట్లు వి నాలని కాంగ్రెస్ నేతలు అధికారులకు హు కూం జారీ చేశారు. పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కార్యకర్తల ప్రమేయంతో రాజకీయ జోక్యం చేసుకోవడంపై విమర్శలకు తావిస్తున్నది.
ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో గ్రామ సభల్లో నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలి. గతంలో ఇందిరమ్మ ఇల్లు కేటాయించి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులను కమిటీలో చేర్చి పాత పరిస్థితే తీసుకురావొద్దు. రాజకీయ జోక్యం ద్వారా అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుంది. లేదంటే బీఆర్ఎస్ తరఫున ఆందోళన చేపడుతాం.
– చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మక్తల్ మాజీ ఎమ్మెల్యే
వనపర్తి, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : వనపర్తి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలకు రెండు వర్గాల నుంచి వేర్వురుగా పేర్లను ప్రతిపాదించడం చర్చనీయాంశమైంది. జిల్లా పరిధిలో 255 గ్రామ పంచాయతీలుండగా, ఐదు మున్సిపాల్టీలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో 7 మండలాలు ఖిల్లాఘణపురం, గోపాల్పేట, పెద్దమందడి, పెబ్బేరు, శ్రీరంగాపురం, రేవల్లి, వనపర్తి ఉండగా, రెండు మున్సిపాల్టీలు పెబ్బేరు, వనపర్తి ఉన్నాయి. ఇందిరమ్మ కమిటీల ప్రతిపాదనలో ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గం, అలాగే రాష్ట్ర ప్రణాళి కా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వర్గాలు వేర్వేరుగా పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రధానంగా ఎమ్మెల్యే వర్గం కొంత ముందు వరుసలో ఉండగా, చిన్నారెడ్డి వర్గం సైతం తమకు పట్టున్న గ్రామాల్లో పేర్లను అధికారులకు ప్రతిపాదించడం చర్చనీయాంశమైంది.
శ్రీరంగాపూర్ మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో రెండు వర్గాల ప్రతిపాదనలు అందించారు. అలాగే పెద్దమందడిలోనూ అధిక గ్రామాల నుంచి రెండు లిస్టులు అధికారులకు చేరాయి. ఇక మిగిలిన గోపాల్పేట, రేవల్లి, పెబ్బేరు మండలాల్లో కూడా సగం జీపీల నుంచి పోటాపోటీగా లిస్టులను పంపినట్లు చెబుతున్నారు. వనపర్తి, ఖిల్లాఘణపురం మండలాల నుంచి ఎమ్మెల్యే వర్గం వారే పేర్ల లిస్టులను పంపినట్లు తెలిసింది. ఇక మున్సిపాల్టీలకు సంబంధించి పెబ్బేరు, వనపర్తిలలో ఎమ్మెల్యే వర్గమే పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల నుంచి వనపర్తి నియోజకవర్గంలో రెండు వర్గాలు తమదే పైచేయి అంటే.. కాదు తమదే పైచేయి అన్నట్లుగా కొనసాగుతున్నాయి. ఎవరికి వారు తగ్గేదేలేదన్నట్లుగా వ్యవహారం సాగుతున్నది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి వేర్వేరుగానే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి కలిసి కార్యక్రమంలో పాల్గొన్నా అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇండ్ల కమిటీల్లోనూ పోటాపోటీలు వేర్వేరుగా ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో అధికారులు ఏం చేయాలతో పాలుపోక తలలుపట్టుకుంటున్నారు. కాగా, ఇందిరమ్మ ఇండ్ల కమిటీల్లో కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని మాత్రమే ప్రతిపాదిస్తున్నారని, నిబంధనలను పట్టించుకోవడం లేదని ప్రతిపక్షపార్టీల నాయకులు చెబుతున్నారు.