మహబూబ్‌నగర్, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి పాలమూరు జిల్లాను చలి గజగజ వణికిస్తున్నది. రెండు మూడు రోజులుగా మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు చలికి తల్లడిల్లి పోతున్నారు. ఒకవైపు చలి మరోవైపు చలి గాలులు ప్రజలను వణికిస్తున్నాయి. మధ్యాహ్నం ఎండ వచ్చినా చలి విపరీతంగా ఉండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చాలా మంది ఉదయం వాకింగ్ వెళ్లే వారు చలి ప్రభావంతో బాగా తగ్గిపోయింది. కూరగాయలు, పాలు అమ్ముకునే చిరు వ్యాపారులు సైతం చలికి భయపడి పొద్దు ఎక్కిన తర్వాత గాని షాపులు తెరవడం లేదు.
ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో చల్లదనం పెరిగిపోతున్నది. జాతీయ రహదారులు గ్రామీణ రహదారులపై తెల్లవారుజామున ప్రయాణించాలంటే భయపడిపోతున్నారు. కొండాకోనలు గ్రామీణ ప్రాంతాలను చలి దుప్పటి కప్పేస్తున్నది. చలి తీవ్రత మంచు ప్రభావం వల్ల రహదారులు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ఠస్థాయికి పడిపోవడంతో సాయంత్రం కాగానే చలిమంటలు వేసుకుంటున్నారు. రాత్రి 8 అయ్యిందంటే చాలు గ్రామాలు, పట్టణాల్లో జన సంచారం పూర్తిగా తగ్గిపోతున్నది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఏకంగా 8 సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మిగతా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉండడంతో ఉత్తరభారతాన్ని పాలమూరు జిల్లా తలపిస్తున్నది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గత పది రోజులుగా చలి విపరీతంగా ఉండడంతో గ్రామాలు పట్టణాల్లో మంచు దుప్పటి కమ్మెస్తున్నది. పొద్దున్నే పొలాలకు వెళ్లాలనుకునే రైతులు వ్యవసాయ కూలీలు మంచు కారణంగా వెళ్లలేకపోతున్నారు. గ్రామీణ రహదారులు పట్టణ రహదారులన్నీంటినీ మంచు కమ్మేయడంతోపాటు ఊటీని తలపిస్తున్నది. ఇక గుట్టల ప్రాంతాల్లో అయితే విపరీతంగా చలి ఏర్పడి ఉదయం తొమ్మిది అయినా ఇంకా మబ్బుల్లోనే ఉంటున్నాయి.
బయట చలి తీవ్రతరం కావడంతో ప్రజలు ఉన్ని దుస్తులు ధరించి బయటకు వెళ్తున్నారు. ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే వాళ్లంతా గ్లౌజులు వేసుకొని బయటకి వస్తున్నారు. పొగ మంచు హైదరాబాద్ బెంగళూరు రహదారిని పూర్తిగా కప్పేస్తున్నది. భారీ వాహనాలు, బస్సులు, కార్లు ఈ రహదారిపై మీటర్ల దూరంలోనే వాహనాలు కనిపించకపోవడంతో లైట్లు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా డ్రైవర్లు ఉదయం 9 గంటల వరకు తమతమ వాహనాలను రహదారుల పక్కన నిలిపిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో తెల్లవారుజామునే కూరగాయలు, పాల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఉదయం నాలుగు గంటలకే లేచి కూరగాయలు, పాలను గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలకు తీసుకువస్తుంటారు. జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీల్లో కూరగాయల వ్యాపారులు తెల్లవారుజామున వచ్చి కుప్పలుగా పోసుకొని అమ్ముకుంటున్నారు. చలి తీవ్రత వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని చిరు వ్యాపారులు బయటికి రావాలంటే వణికిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చలి ఉందని వాపోతున్నారు. ఫలితంగా పొదెక్కగానే కూరగాయలను తీసుకొని పట్టణాలకు వస్తే గిరాకీ లేక వెనుదిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇల్లిల్లు తిరిగి పాల వ్యాపారం చేసే పాల వ్యాపారులు సైతం తెల్లవారుజామున పాలను సరఫరా చేయలేకపోతున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రెండు మూడు రోజుల నుంచి చలి తీవ్రంగా ఉండడం తో మహబూబ్‌నగర్ జిల్లాలో 13 స్థాయికి చేరుకుంది. గద్వాలలో 11 డిగ్రీలు.. వనపర్తిలో 11 డిగ్రీలు.. నారాయణపేటలో 10 డిగ్రీలు.. నాగర్‌కర్నూల్‌లో పది డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శా ఖ తెలిపింది. 15నుంచి 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటేనే చలి విపరీతం అనిపిస్తుంది.
అలాంటిది ఏకంగా 10 డిగ్రీల వరకు పడిపోవడంతో పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎండ ఉన్నప్పటికీ చలి తీవ్రత కనిపిస్తున్నది. బయట ఎండ ఉన్న ఇండ్లల్లో మాత్రం చలి ఉంటుందని మహిళలు అంటున్నారు. దీనికి తోడు చలిగాలుల ప్రభావం వల్ల గ్రామాలు పట్టణాలు నిర్మానుషంగా మారుతున్నా యి. అయితే చలి తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా వృద్ధులు, చిన్నపిల్లలు ఎక్కువగా బయట తిరగవద్దని, ముఖ్యంగా శ్వాసకోస సమస్యలు ఉన్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.