Maganuru | మాగనూర్, జూన్ 20 : మాగనూరు మండలం నేరడగం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కొరకు ఏర్పాటుచేసిన భోజనశాల అసంపూర్తిగా ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం హయంలో విద్యార్థులు భోజనం చేయడానికి ఒక హాల్ ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు డైనింగ్ హాల్ నిర్మించాలనే ఉద్దేశంతో కొన్ని లక్షలు వెచ్చించి నిర్మాణాలు చేపట్టారు. అయితే కొన్నిచోట్ల డైనింగ్ హాల్ పనులు అసంపూర్తిగా వదిలేశారు. ప్రభుత్వం మారిపోవడంతో నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లు కూడా బిల్లలు పెండింగ్లో పడిపోయాయని, బిల్లులు క్లియర్ అయితేనే పనులు కొనసాగే అవకాశం ఉందంటున్నారు.
ఈ విషయంపై కాంట్రాక్టర్ ఎల్లారెడ్డి కల్లప్ప మాట్లాడుతూ… గత ప్రభుత్వం హాయాంలో నేరడగం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాలలో మన ఊరి మన బడి పథకం కింద పాఠశాలలో మైనర్ రిపే, డైనింగ్ హాల్ ఇతరత్రా పనులకు దాదాపు రూ. 44 లక్షలు కేటాయించిందని దాదాపు 70 శాతం పనులు పూర్తి చేశామని ప్రభుత్వం నుండి డబ్బులు రాక ఒక డైనింగ్ హాల్ మాత్రమే అసంపూర్తిగా నిలిచిపోయిందని, ఇక ప్రభుత్వం మారిపోవడంతో వాటిని పట్టించుకునే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన పనులకు డబ్బులు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం నుండి చేసిన పనులకు డబ్బులు కేటాయించి డైనింగ్ హాల్ పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని విద్యార్థి తల్లిదండ్రులు అన్నారు. ఈ విషయంపై మండల విద్యాధికారి మురళీధర్ రెడ్డిని వివరణ కోరగా మన ఊరి మనబడి కింద వర్క్ చేసిన దాంట్లో మాగనూరు మండల కేంద్రానికి మాత్రమే డబ్బులు పూర్తిగా వచ్చాయని మిగతా ఎక్కడ కూడా డబ్బులు రాలేదని ఈ సందర్భంగా వారు తెలిపారు.