హన్వాడ, జూలై 18 : సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే ఓర్వలేక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు గంటల విద్యుత్ చాలని దురహంకారంగా మాట్లాడుతున్నారని, గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను రైతులు నిలదీయాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని దాచక్‌పల్లిలో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ముందుగా మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా రూ. 19లక్షల 42వేలతో నిర్మించిన మండల పరిషత్ పాఠశాలను ప్రారంభించారు. రూ.10లక్షలతో నిర్మిస్తున్న కమ్యూనిటీహాల్‌కు శంకుస్థాపన చేశారు. 26మందికి 13ఎకరాల 20గుంటల పోడుభూమి పట్టాలను అందజేశారు. రూ.52లక్షల 50వేలతో టంకర బీటీరోడ్డు నుంచి దాచక్‌పల్లి వరకు నూతనంగా వేసిన బీటీరోడ్డును ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఐదేండ్ల పోడు భూము ల సమస్యను సీఎం కేసీఆర్ పరిష్కరించి పట్టాలను అందజేశారన్నారు.
ఈ రైతులకు పంట పెట్టుబడితోపాటు రైతుబీమా కూడా వస్తుందని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే 24గంటల విద్యుత్, ధరణి, రైతుబంధు, పింఛన్ ఎత్తివేస్తారన్నారు. పక్కనే ఉన్న కర్ణాటకలో 24గంటల విద్యుత్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్‌కు ధీటుగా విద్యను అందిస్తున్నామని, గురుకులంలో చదువుకుంటున్న ఒక్క విద్యార్థిపై ప్రభుత్వం ఏడాదికి రూ.లక్షా 25వేలు ఖర్చు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ విజయనిర్మల, సింగిల్ విండో చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రాజుయాదవ్, ఏపీఎం సుదర్శన్, ఎంపీడీవో ధనుంజయగౌడ్, తాసీల్దార్ శ్రీనివాసులు, డీఈవో రవీందర్, ఎంఈవో రాజునాయక్, సర్పంచ్ బాలకిష్ణారెడ్డి, ఎంపీటీసీ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.