మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 3 : ప్రతి ఇంటికీ సంక్షేమం అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. మనది కరువు జిల్లా కాదు.. కడుపు నింపే జిల్లాగా మార్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ప్రైవేటు ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ యూనియన్ నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రికి భారీ గజమాలను క్రేన్ సహాయంతో వేశారు. అనంతరం కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. గతంలో వడ్డెరబస్తీ అంటే ఎక్కడుందో తెలియని పరిస్థితి ఉండేదని, నేడు పట్టణంతో సమానంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. లొల్లి పెట్టి కాలయాపనతో రాజకీయం చేసేవారికి అభివృద్ధి గురించి తెలియదన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపనతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ప్రతి కుటుంబాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు. వడ్డెర బస్తీలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్లో వంట చేసేందుకు ప్రత్యేక గదితోపాటు పెండ్లిళ్లు, ఫంక్షన్లు చేసుకునేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.
మహిళా సంఘాలకు ఈ భవనాన్ని అప్పగిద్దామని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రైవేటు ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ భవనంలో వివిధ సదుపాయల నిమిత్తం రూ.5లక్షలు కేటాయించనున్నట్లు వివరించారు. తెలంగాణ రాకముందు గత ప్రభుత్వాలు ఏం చేశాయి? జీవన పరిస్థితులు ఎట్లా ఉండే? అప్పటి మంత్రులు మన కాలనీలకు వచ్చారా? ఇలా ప్రతి విషయాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. మనది కాలయాపన చేసే ప్రభుత్వం కాదని.. ప్రతి క్షణం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నదన్నారు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మహబూబ్‌నగర్ నిలిచిపోయిందని వివరించారు. విడుతల వారీగా బీసీ బంధు అందిస్తామన్నారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ వెంక న్న, కౌన్సిలర్ రవికిషన్‌రెడ్డి, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్, సంఘం అధ్యక్షుడు వెంకటేశ్‌చారి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసుగౌడ్ తదితరులున్నారు.
పేదలకు కార్పొరేట్ వైద్యం
హన్వాడ, సెప్టెంబర్ 3 : పేదలకు కార్పొరేట్ తరహా వైద్యం అందిస్తామని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మండలంలోని బుద్ధారం గ్రామానికి చెందిన గోవిందమ్మ నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతుండగా వైద్యం కోసం రూ.3లక్షలు మంజూరయ్యాయి. అందుకు సంబంధించిన చెక్కును ఆదివారం ఆమె భర్త వెంకట్రాములుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్ అందిస్తామన్నారు. మండలంలో ఇప్పటి వరకు 250మందికి సీఎం సహాయనిధి చెక్కులు అందజేశామన్నారు. అనంతరం గుడ్డిమల్కాపురం ఎంపీటీసీ మాల్కయ్య, మౌనిక నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, ఎంపీపీ బాలరాజు, ఎంపీడీవో ధనుంజయగౌడ్, సర్పంచులు బాలాగౌడ్, వెంకన్న, లక్ష్మీనారాయణ, సుధ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అర ఎకరంలో రెడ్డి ఫంక్షన్ హాల్
మహబూబ్‌నగర్ అర్బన్, సెప్టెంబర్ 3 : మహబూబ్‌నగర్ శివారులోని బోయపల్లిలో రెడ్డి ఫంక్షన్ హాల్ నిర్మాణానికి అర ఎకరం భూమి, రూ.కోటి నిధులు మంజూరు చేసినట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెడ్డి సేవా సంఘం సభ్యులకు ఈ మేరకు మంత్రి ఉత్తర్వుల కాపీని అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. పేద, ధనిక తేడాలేకుండా ప్రతి ఒక్కరూ వివాహాది శుభకార్యాలు వైభవంగా నిర్వహించుకునేలా చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ గిరిధర్‌రెడ్డి, రైతుబంధు సమితి డైరెక్టర్ నర్సింహారెడ్డి, రెడ్డి కౌన్సిలర్ అనంతారెడ్డి, సేవాసంఘం నాయకులు బుచ్చిరెడ్డి, రామకృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సత్యారెడ్డి, ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.