దేవరకద్ర రూరల్, డిసెంబర్ 25 : అన్నివర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ సమీపంలోని హజరత్ మహబూబ్ దర్గా ఆవరణలో ఎమ్మెల్యే నిధులు రూ.3లక్షలతో నిర్మించిన వంటశాలను ప్రారంభించారు. అనంతరం హజరత్ సుభహాని ఉర్సులో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల సంక్షేమానికి దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చి సమన్యాయం చేస్తున్నట్లు వివరించారు.
రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి మెరుగైన విద్య అందించేందుకు మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్ర ప్రజలు కులమతాలకు అతీతంగా అన్నదమ్ముళ్ల కలిసిమెలిసి జీవిస్తుండగా, బీజేపీ నాయకులు కులమతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ నుంచి బీజేపీని తరమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటికైనా మతతత్వ రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. అందరి సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా నిలిచి రుణం తీర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కరుణాకర్‌రెడ్డి, డాక్టర్ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.