మూసాపేట(అడ్డాకుల), ఫిబ్రవరి 16 : అర్ధరాత్రి ఆగంతకులు హల్చల్ చేశారు. గన్‌తో వీధికుక్కలపై కాల్పులు జరుపుతూ అలజడి సృష్టించారు. దీంతో గ్రామస్తులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ ఇంటి తలుపులు తీయడానికి కూడా సాహసించలేదు. వెంటాడి కాల్పులు జరపగా, 20 వీధికుక్కలు చనిపోగా, మరో ఐదింటికి తీవ్రగాయాలైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని పొన్నకల్ గ్రామంలో చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం అర్ధరాత్రి పొన్నకల్ గ్రామంలోకి మారుతీ బ్రెజా కారులో వచ్చిన ఆగంతకులు మసీదు వద్ద ఉన్న ఓ కుక్కపై లేజర్‌లైట్ వేసి గన్‌తో కాల్పులు జరిపారు. ఆ శబ్దానికి ఆ పక్కనే ఆలయంలో శివమాలధరించిన రాజు, ఆంజనేయులు నిద్రలో నుంచి లేచి చూడగా, కారు గ్రామంలోకి వెళ్తూ కనిపించింది. వీధుల్లో కారులో తిరుగుతూ కనిపించిన కుక్కలపై కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఆగంతకులను కారులో చూసిన ఆంజనేయులు, రాజు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి రాజవర్ధన్‌రెడ్డి బయటకు వచ్చి చూశాడు. కానీ వారి చేతిలో లేజర్ లైట్‌తో ఉన్న తుపాకులు ఉండడంతో ఏం చేయాలో తెలియక అలాగే ఉండిపోయాడు. అర్ధరాత్రి తుపాకుల మోతలను చూసిన గ్రామస్తులు భయంతో బయటకు రాలేదు. బిక్కుబిక్కుమంటూ ఇండ్లలోనే ఉండిపోయారు. తెల్లవారాక గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో వారు ఉదయం 8:30గంటలకు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శ్రీనివాసులు పోలీసులతో ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి సీఐ రామకృష్ణకు సమాచారమిచ్చారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో ఆనవాళ్లను సేకరించారు. అదేవిధంగా గ్రామస్తులకు బుల్లెట్‌కు ఉండే కోట్స్ రెండు లభించాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గ్రామంలో కారులో తిరుగుతూ మొత్తం 25 కుక్కలపై తుపాకులతో కాల్పులు జరిపారు. వీటిలో ఐదు కుక్కలు గాయాలతో బతికి బయటపడగా, 20కుక్కలు మృతిచెందాయి. వాటిని గ్రామ పంచాయతీ సిబ్బంది సహాయంతో ట్రాక్టర్లో వేసి గ్రామానికి దూరంగా తీసుకెళ్లారు. పశువైద్యాధికారి రాజేశ్‌ఖన్నా వాటికి శవపరీక్షలు నిర్వహించి నమూనాలను సేకరించారు. హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు.
గ్రామంలో కుక్కలపై తుపాకులతో కాల్పులు జరపడం వెనక గ్రామస్తుల హస్తం ఉండి ఉండవచ్చని సీఐ రామకృష్ణ విచారణ చేశారు. గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్మీ జవాన్ రాజవర్ధన్‌రెడ్డి 2019 పదవీ విరమణ సమయంలోనే తుపాకీ కోసం దరఖాస్తు చేసుకోగా, ఇచ్చారని, కొన్ని రోజులు బ్యాంకులో ఉద్యోగం చేసి మానేసినట్లు పోలీసులకు రాజవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఆ తుపాకీ ఇంకా అతని వద్దనే ఉందని తెలియడంతో ఎస్సై శ్రీనివాసులు స్వాధీనం చేసుకున్నారు. తుపాకీకి సంబంధించిన 10రౌండ్ల బుల్లెట్లు ఇవ్వగా, దుండగులు కాల్చిన బుల్లెట్ల కోక్కు, రిటైర్డ్ ఆర్మీ జవాన్ గన్నుకు ఎలాంటి సంబంధం లేదని సీఐ తెలిపారు.
కారులోని నలుగురు వ్యక్తులు తుపాకులతో కుక్కలపై కాల్పులు జరిపిన ఘటనను గ్రామంలో ఆరుబయట మంచంపై నిద్రించిన రామస్వామి గమనించాడు. కుక్కను చంపడం చూసి భయంతో ఇంట్లోకి పరుగు పెట్టాడు. తర్వాత గ్రామస్తులకు ఈ విషయమై సమాచారం ఇచ్చాడు. బ్రెజా కారులో నలుగురు తుపాకులు పట్టుకొని కుక్కలపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. కాల్పుల కలకలంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.
మూగజీవాలపై వైరంతో తుపాకీతో కాల్చిచంపడం హేమమైన చర్య అని, కాల్పులు జరిపిన వారిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని భూత్పూర్ సీఐ రామకృష్ణ చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి విజయరామరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విచారణ చేపట్టి త్వరలోనే దోషులను పట్టుకుంటామని తెలిపారు.