Kalwakurthy | కల్వకుర్తి, జనవరి 19 : అనుమతులు ఉన్నాయనే ముసుగులో గుట్టను కరిగించేశారు. ఈ గుట్ట ఎక్కడో అడవిలో ఉండి ఎవరికీ కనిపించడం లేదని అనుకుంటే పొరపాటు. ఈ గుట్ట కల్వకుర్తి- నాగర్‌కర్నూల్ ఆర్అండ్బీ రహదారి పక్కన (ఇప్పుడు 167కే జాతీయ రహదారి) కల్వకుర్తి మండలం తుర్కలపల్లి గ్రామ శివార్లలో ఉంది. పెద్దపెద్ద రాళ్లు, పచ్చని చెట్టతో అహ్లాదకరంగా ఉన్న గుట్టకు అనుమతుల గ్రహణం పట్టింది. అనుమతులు ముసుగులో అక్రమార్కులు గుట్టను కరిగించి పడేశారు. గుట్ట క్రమక్రమంగా కరిగిపోతున్నా.. ఈ దారిగుండా వెళ్లే ఉన్నత స్థాయి అధికారులకు కనిపించకపోవడం నిజంగా వింతే. వెయ్యో, రెండు వేలో కాదు.. లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి ఫలహారమైపోయింది.
అనుమతులు ముసుగులో..
నంద్యాల వరకు నిర్మిస్తున్న ఎన్‌హెచ్167కే జాతీయ రహదారి కల్వకుర్తి మండలం నుంచి వెళ్తుంది. రోడ్డు నిర్మాణంలో భాగంగా మట్టి అవసరం ఉన్న నేపథ్యంలో సదరు గుత్తేదారుకు తుర్కలగుట్ట నుంచి మట్టి తీసుకునేందుకు మైన్స్ శాఖ అధికారులు అనుమతులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పత్రాలు స్థానిక అధికారుల వద్ద లేకపోవడం విడ్డూరంగా ఉన్నది. ఎన్ని క్యూబిక్ మీటర్ల మట్టి తీసుకోవడాని కి అనుమతి ఉందన్న విషయం బ్రహ్మ పదార్థమైంది. రియల్ ఎస్టేట్ వెంచర్ల యజమానులు సదరు మట్టిని అప్పనంగా దోచేసుకున్నారు. నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే మట్టి మాఫియా మాయాజాలంలో గుట్ట మాయమైపోయింది. గుట్ట మట్టిని కొల్లగొడుగుంటే అధికారులు ప్రేక్షక పాత్ర పోషించార ని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు. లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తరలిపోతుంటే సంబంధిత శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో..
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2024 ఏడాది జూన్, జూలైలో కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు అప్పటి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పలు స్థలాలను పరిశీలించారు. ఇందులో భాగంగా హైవే పక్కన తుర్కలపల్లి గుట్ట అనువుగా ఉందని నిర్థారణకు వచ్చారు. అంతా సిద్ధమై జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే సమయానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ప్రభుత్వం మారడంలో జర్నలిస్టులు ఇండ్ల స్థలాల మాటేదేవుడుడెరుగు.. గుట్ట క్రమేపీ మాయమైపోతున్నది. అక్రమంగా మట్టిని కొల్లగొట్టిన వారిపై చ ర్యలు తీసుకుని రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా మెక్కిన సొమ్మును రాబట్టాలని ప్రకృతి ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
167కే హైవేకు మైన్స్ శాఖ నుంచి..
గుట్ట కరిగిపోవడం గురించి కల్వకుర్తి తాసీల్దార్‌ను వివరణ కోరగా గుట్ట నుంచి మట్టి తీసుకునేందుకు 167కే ర హదారి నిర్మాణ గుత్తేదారుకు మైన్స్ శాఖ నుంచి అనుమతులు ఉన్నాయన్నారు. ఎంత మట్టి తీసుకోవాలనే విషయమై ఏదైనా ఆర్డర్ ఉందా అని అడిగితే.. దానికి సంబంధించిన ప్రొసీడింగ్ లేదని తాసీల్దార్ చె ప్పారు. గుట్ట నుంచి విపరీతంగా మట్టి తరలించారనే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో విచారణ చేపడతామని తాసీల్దార్ ఇబ్రహీం చెప్పారు.