అలంపూర్, జూన్ 26 : నా బండి నా ఇష్టం.. నచ్చిన బొమ్మ, పేర్లు రాసుకుంటామనేవిధంగా కొందరు వాహనదారులు వ్యవహరిస్తున్నారు. వాహనాలపైనే కాకుండా నెంబర్ ప్లేట్స్‌పై తమకు నచ్చిన బొమ్మలు, పేర్లు రాయించుకొని రోడ్డు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. బైక్‌లు ఇతర వాహనాలపై రంగురంగుల స్టిక్కర్లతోపాటు రాజకీయ పార్టీల గుర్తులు, వివిధ సంఘాల నాయకులు, సినీనటుల చిత్రాలు వేసుకుంటున్నారు. వాహనాలపై బొమ్మలు, పేర్లు రాసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. వాహన అద్దాలపై స్టిక్కర్లు అంటించుకోవడం వల్ల ముందు వెళ్లే వాహనాలను గుర్తించడం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వాహనాలతో ప్రమాదాలు చోటుచేసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. మరికొందరు వాహన నెం బర్ కనిపించకుండా చేస్తున్నారు. ప్రమాదం జరిగితే తప్పించుకుపోయే వాహనాల్లో ఇటువంటివి ఎక్కువగా ఉంటున్నాయని చెప్పవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో ఆర్టీఏ కార్యాలయంలో ఇచ్చే హై సెక్యూరిటీ నెంబర్ ప్టేట్ల స్థానంలో వారికి నచ్చిన మోడల్లో నెంబర్ ప్లేట్లను బిగించుకుంటున్నారు. కొంతమంది వాహనదారులు ఏకంగా నెంబర్ ప్లేట్లు లేకుండా రోడ్లపై నడుపుతున్నారు. ఇటీవల వివిధ శాఖల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు తమ వాహనం, నెంబర్ ప్లేట్లపై ఆయా శాఖల పేర్లు, హోదాలు రాసుకోవడం కొత్త ట్రెండ్‌గా మారింది. నిబంధనలను పట్టించుకోని వాహనదారులను సం బంధిత అధికారులు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.