వర్షాలు పుష్కలంగా కురవడం..ఎగువన కృష్ణాబేసిన్‌లో వచ్చిన వరద కారణంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జలవిద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది లక్ష్యానికి మించి రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించారు. సుమారు 811 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి చేరువయ్యారు. జలవిద్యుత్ కేంద్రాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఈస్థాయిలో విద్యుదుత్పత్తి కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని వనరులను సద్వినియోగం చేసుకుని రికార్డు సాధించారు.
– మహబూబ్‌నగర్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్‌నగర్, నవంబర్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి): నారాయణపేట, గద్వాల జిల్లా సరిహద్దులోని ఎగువ జురాల విద్యుత్ కేంద్రం, వనపర్తి జిల్లాలోని దిగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఈఏడాది లక్ష్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి సాధించడంతో ఇంజినీర్లను అభినందిస్తున్నారు. 640 మిలియన్ యూనిట్ల లక్ష్యాన్ని ఛేదించి 811 మిలియన్ యూనిట్లు సాధించారు. వరద ఇంకా కొనసాగితే మరింత ఉత్పత్తి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. లక్ష్యానికి మించి రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించిన ఉద్యోగులను మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు సీఎండీ ప్రభాకర్‌రావు అభినందించారు. ఇదిలా ఉండగా జూరాల ప్రాజెక్టులో ఇప్పటి వరకు 1202 టీఎంసీల వరదను దిగువకు వదిలారు. ఇది కూడ ఒక రికార్డే అని అంటున్నారు.
దిగువ, ఎగువ పవర్ స్టేషన్లో..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈఏడాది జూన్ నుంచి వరుసగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణాబేసిన్‌లోని ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. కర్ణాటకలోనూ భారీ వర్షాలు పడడంతో జూరాల ప్రాజెక్టుకు ఎన్నడూ లేనంతగా వరద పోటెత్తింది. ఇప్పటివరకు సుమారు 1202 టీఎంసీల నీళ్లు దిగువకు వదిలారంటే ఏ మేరకు వరద ప్రవాహం ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో జూరాల కుడి విద్యుత్ కేంద్రం, ఆత్మకూర్ పరిధిలోని దిగువ జల విద్యుత్ కేంద్రాలు కూడా నిరంతరాయంగా పనిచేయడంతో విద్యుత్ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరుకున్నది. దిగువ, ఎగువ విద్యుత్ కేంద్రాల్లోని 12 యూనిట్లలో ఎలాంటి సాంకేతిక లోపం లేకుండా విద్యుత్ ఉత్పత్తి సాధించడం రికార్డేనని ఆఫీసర్లు అంటున్నారు. 2021-22 సంవత్సరానికిగానూ 724 మి.యూనిట్ల లక్ష్యం కాగా ఇప్పటికే 704 మిలియన్ యూనిట్ల లక్ష్యానికి చేరుకున్నామని జూరాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఎస్ఈ జయరాం వివరించారు. వరద ఇలాగే కోనసాగితే మరింత పెరిగే చాన్స్ ఉందని అంటున్నారు.
నిజాం కాలంలోనే విద్యుత్ ఉత్పత్తి..
గద్వాల, ఆత్మకూరు మధ్యలో ప్రస్తుతం దిగువ జలవిద్యుత్ కేంద్రం ఉన్న ప్రదేశంలో నిజాం అంతకంటే ముందునుంచే విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. భౌగోళికంగా ఎలాంటి శ్రమలేకుండా సహజసిద్ధంగా ఏర్పడ్డ రాళ్ల వరుస విద్యుత్ ఉత్పత్తికి అనుకూలంగా ఉండేది. ఇక్కడే చిన్నచిన్నజలపాతాలు కూడా ఆకట్టుకునేవి. దీంతో గద్వాలకు ఇక్కడ నుంచే విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు చెబుతున్నారు. దీన్ని బేస్‌గా చేసుకుని దిగువ జురాల విద్యుత్ కేంద్రాన్ని డిజైన్ చేశారు. ఫలితంగా జలవిద్యుత్ ఉత్పత్తి ద్వారా కరంట్ కోతలు లేకుండా అందించే వీలు కలుగుతుంది. తక్కువ ఖర్చుతో తెలంగాణకే ఉపయోగపడే విద్యుత్ కేంద్రాల్లో జూరాల ఒకటి.
స్వరాష్ట్రంలో పెరిగిన ఉత్పత్తి..
తెలంగాణ సాధించాక రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో జలవిద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా సాధిస్తున్నారు. ముందే అన్ని యూనిట్లను చెక్ చేసుకుని వరద వచ్చే సమయానికి ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా రేయింబవళ్లు కష్టపడి ఉద్యోగులు, ఆఫీసర్లు విద్యుత్ ఉత్పత్తిని చేపడుతున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఎగువ జూరాల విద్యుత్ కేంద్రంలో 2,613 మి.యూనిట్లు విద్యుత్‌ను విజయవంతంగా చేపట్టారు. దిగువ విద్యుత్ కేంద్రంలో 2,052 మి.యూనిట్ల విద్యుత్‌ను సాధించారు.
12యూనిట్లలో పవర్ జనరేట్ చేస్తున్నాం
జూరాల విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా లక్ష్యానికి మించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాం. ఈఏడాది రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేశాం. ఇప్పటి వరకు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తలేదు. ఎగువ నుంచి నిరంతరాయంగా వస్తున్న వరదను విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తున్నాం. 640 మి.యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం కాగా ఇప్పటికే 811 మి.యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించాం.
– జయరాం,ఎస్ఈ