గద్వాల, మార్చి 15: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటివెలుగుకు ఆదరణ పెరుగుతున్నది. మసకబారుతున్న చూపుకు కంటివెలుగుతో జీవితాల్లో వెలుగు నిండుతున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో చూపు మందగించిన వారికి కార్యక్రమం వరంగా మారింది. కంటివెలుగు శిబిరాలకు వచ్చి పరీక్షలు చేయించుకునే వారు పెరుగుతున్నారు.
ప్రజలు నిత్యం దుమ్మూ, ధూళి మధ్య ప్రయాణం చేయడం, కంటి సంరక్షణకు అద్దాలు వాడక పోవడంతో గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు కంటి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. చాలామందికి కంటి సమస్యలు ఉన్నప్పటికీ చూపించుకునే స్థోమత లేకపోవడం కారణమైతే నిర్లక్ష్యం మరో కారణం. వీటి ద్వారా ప్రజల్లో కనుచూపు మసకబారడంతోపాటు కంటిచూపు కోల్పోతున్నారు. వీటన్నింటిని గ్రహించిన ప్రభుత్వం 2108 ఆగస్టులో కంటివెలుగు పథకం ప్రారంభించింది. ఆదరణ రావడంతో ప్రభు త్వం జనవరిలో రెండో విడుత కంటివెలుగు కార్యక్రమం ప్రారంభించింది. జిల్లాలో 255 పంచాయతీల్లో, 77వార్డు ల్లో నిర్వహిస్తున్నారు. 18ఏండ్లు పైబడినవారు 3,75,000 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వం 25బృందాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నది.
లక్షకు పైగా కంటి పరీక్షలు
జోగుళాంబ గద్వాల జిల్లాలో కంటివెలుగు కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు డాక్టర్లు కంటి సమస్యలు ఉన్న వారిని 1,23,493 స్క్రీనింగ్ చేశారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు పరీక్షలు నిర్వహించిన వారికి రీడింగ్ అద్దాలు 15,162మందికి పంపిణీ చేశారు. 15,592మందికి అద్దాలకు ఆర్డర్ పెట్టినట్లు వైద్యాధికారులు తెలిపారు. కంటివెలుగు కార్యక్రమం ద్వారా ప్రజల కంట్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్కు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
ప్రైవేట్ దవాఖానకు వెళ్లి చూపించుకుందామంటే డబ్బులు ఎక్కువగా ఖర్చయ్యేవి. ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు నిర్వహించి కండ్లద్దాలు ఇస్తుండడంతో సంతోషంగా ఉంది. అవసరమైన కంటి డ్రాప్స్ ఇచ్చారు. పేదలకు కంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– మహదేవమ్మ, శేరెల్లివీధి, గద్వాల
నిరుపేదలకు వరం
ప్రభుత్వం కంటివెలుగు శిబిరాల ద్వారా ఉచిత పరీక్షలు నిర్వహించడం నిరుపేదలకు వరం. ప్రైవేట్లో కంటి పరీక్షలు చేయించుకొని అద్దాలు తీసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్నది. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేస్తుండడంతో శిబిరాల వద్దకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగితే బాగుంటుంది.
– పావని, శేరెల్లివీధి, గద్వాల