మహబూబ్నగర్ కలెక్టరేట్, జూన్ 25 : ప్రజాప్రతినిధులు, అధికారుల అసమర్థ పాలనలో పాలమూరు యూనివర్సిటీ వసతి గృహ విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నామంటూ ఆందోళనకు దిగారు. బుధవారం పాలమూరు యూనివర్సిటీ ప్రధాన ముఖద్వారం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. అనంతరం పీయూ నుంచి మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కాలి నడకన వెళ్లి కలెక్టర్ విజయేందిరబోయికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ పాలమూరు యూనివర్సిటీ వసతి గృహాల నిర్వహణ రోజురోజుకి దిగజారి పోతుందన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడానికి కూడా నిర్వహణ అధికారులు వెనుకడుగు వేస్తున్నారని తెలిపారు. పది రోజులుగా ఉడికీ ఉడకని అన్నం, నీళ్లచారు, కారం మెతుకులతో కాలం వెళ్లదీస్తూ కడుపునొప్పితో కష్టాల పాలవుతున్నామని వాపోయారు. అందించే భోజనం బాగాలేదంటూ 3గంటల పాటు పీయూ ఎదుట బైఠాయించినా పట్టించుకునే దిక్కులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆకలి బాధలు తాళలేక యూనివర్సిటీ యాజమాన్య వైఖరికి నిరసనగా ఖాళీ కడుపులతో.. ఒంట్లో సత్తువ లేకున్నా.. తమ సమస్యలు విన్నవించుకునేందుకు పీయూ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నడుచుకుంటూ వెళ్లారు. జిల్లా కలెక్టర్కు వర్సిటీ సమస్యలపై దృష్టి సారించాలని పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులు, ట్యూషన్ ఫీజులు, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేసి విద్యార్థులపై ఆర్థికభారం తగ్గించాలని వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు.