పాలమూరు జిల్లాలో కారుణ్య నియామకాలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటి వరకు 49 మందికిపైగా జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల ఉపాధ్యాయులు, ఇతర స్థానిక సంస్థల ఉద్యోగుల వారసులు దరఖాస్తు చేసుకున్నారు. చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు మానసిక కుంగుబాటుతోపాటు కుటుంబ పోషణ భారమై ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక సంస్థలు, విద్యాశాఖలో పనిచేస్తూ విధినిర్వహణలో మరణించిన ఉద్యోగుల వారసులు తమకున్న అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని, జిల్లా ఉన్నతాధికారులను కోరుతున్నా ఫలితం లేకుండా పోతోందని వాపోతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగి సర్వీ సు కాలంలో మరణిస్తే అతడి, ఆమె కుటుంబంలో భార్య, భర్త, కుమారుడు, కూతురు లేదా కుటుంబీకుల అంగీకారం ఉన్న వారిలో ఒకరికి కారుణ్య ని యామకం ఉద్యోగం ఇవ్వాలి. అతడి, ఆమె అర్హత ఆధారంగా మృతి చెందిన ఉద్యోగి కుటుంబంలో ఒకరికి తత్సమాన ర్యాంక్, విద్యార్హత ఆధారంగా జాబ్ కల్పించాలి. ఉద్యోగుల హక్కే కాకుండా సర్వీసు రూల్స్‌లోనూ ఈ నిబంధన ఉన్నది. ప్రభుత్వ శాఖలకు సంబంధించి కారుణ్య నియామకాలు కొనసాగుతున్నా.. జిల్లా, మండల పరిషత్‌లు, ఇతర స్థానిక సంస్థల్లో మాత్రం సబార్డినేట్ ఉద్యోగాలు తప్పా మిగతా ఉద్యోగాల్లో నియామక ప్రక్రియ ప్రభుత్వం చేపట్టడం లేదు. జిల్లాలో ఎక్కువగా సబార్డినేట్ ఉద్యో గ ఖాళీలే ఉన్నాయి. ఈ ఉద్యోగాల్లో ఉన్నత విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు జాయిన్ అయ్యేందుకు ఆసక్తి చూపడం లేదు.
కారుణ్య నియామకాలకు ఎదురుచూస్తున్న వారిలో చాలా వరకు గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, బీఎడ్, బీటెక్ చదివినవారు ఉన్నారు. తామంతా డిగ్రీ ఉత్తీర్ణులైనందున జెడ్పీ అధికారులు జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని రాత పూర్వకంగా అధికారులకు అప్పీలు చేసుకున్నారు. స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు రిటైర్డ్ అయ్యేవరకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీఅయ్యే అవకాశం లేదు. ప్రభుత్వం కొత్తగా సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టిస్తే తప్పా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో నియామకాలు చేపట్టే వీలు లేదు. ఈ నేపథ్యంలోనే కారుణ్య నియామకాలకు బాధిత కుటుంబాల ఎదురుచూపులు ఎప్పుడు ఫలిస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి కలెక్టర్ ఆధ్వర్యంలో నియామకాలు చేపట్టే అవకాశం ఉన్నా.. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటున్నారు.
ఇంటికి పెద్దదిక్కైన ప్రభుత్వ ఉద్యోగి మృతితో నెలనెలా వచ్చే వేతనం నిలిచిపోయి.. చాలీచాలని పెన్షన్‌తో కుటుంబ పోషణ భారంగా మారి.. ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ.. దుర్భర స్థితిలో ఉద్యోగుల వారసులు జీవిస్తున్నారు. జాబ్‌లు ఎప్పుడొచ్చేనా అని కండ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తున్నారు. పాలమూరు జిల్లాలో 49 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరంతా అధికారుల చుట్టూ పదుల సంఖ్యల్లో ప్రదక్షిణలు చేస్తున్నా ‘కారుణ్యం’ చూపడం లేదని వాపోతున్నారు. ఇంకా ఎన్నాళ్లీ ఎదురుచూపులు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తమ గోడును ఆలకించి అర్హత అధారంగా కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరుతున్నారు.
– మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఆగస్టు 23
మా నాన్న పెంట య్య. కోయిలకొండ మండలం ఎల్లారెడ్డిపల్లి యూపీఎస్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ గుండెపోటుతో మరణించాడు. అమ్మ సరస్వతికి వచ్చే పింఛన్‌తోనే కుటుంబాన్ని పోషిస్తున్నది. ఇల్లు గడవడం కష్టంగా ఉన్నది. నేను డిగ్రీ పూర్తి చేసి డీఎస్సీకి సిద్ధం అవుతున్నా. అధికారులు స్పందించి కారుణ్య నియామకం కింద వెంటనే నాకు ఉద్యోగం కేటాయించాలి.
– భరత్‌కుమార్, మహబూబ్‌నగర్
మా నాన్న నవాబ్‌పేట మండలం కొల్లూరు జెడ్పీహెచ్ఎస్లో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పని చేస్తూ చనిపోయారు. అమ్మ చంద్రకళకు వచ్చే పింఛ న్తోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. నేను బీటెక్ (సివి ల్ ఇంజినీరింగ్) చేశా. నాకు తమ్ముడు, చెల్లి ఉంది. వారిని ఉన్నత చదువులు చదివించేందుకు సైతం ఆర్థిక ఇబ్బందులు తలెత్తు తున్నాయి. జెడ్పీ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. మీ క్రమ సంఖ్య 24.. కొద్దిగా ఆగాలని అంటుండ్రు. నా విద్యార్హతకు అనుగుణంగా సత్వరమే ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలి.
– కిరణ్‌కుమార్, తాటికొండ, భూత్పూరు మండలం
నా భర్త టీవీఎస్ ప్రసాద్. నాగర్‌కర్నూల్ జిల్లా లట్టుపల్లిలో స్కూల్ అసిస్టెంట్ (ఫిజిక్స్)గా విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యంతో చనిపోయారు. నా కుమార్తె సువర్ణ బీటెక్ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధం అవుతుండగా.. కుమారుడు రోహిత్ ఇంటర్ చదువుతున్నాడు. మా పాపకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వాలని జెడ్పీ, కలెక్టరేట్‌కు 15 పర్యాయాలకుపైగా వచ్చా. అయినా అధికారులు ఇదిగో, అదిగో అంటూ తిప్పించుకుంటుండ్రు. ఇప్పటికైనా కరుణించాలి.
– శ్రీలక్ష్మీ, ఎర్రసత్యం చౌరస్తా, మహబూబ్‌నగర్
మా నాన్న ఖాజామియా. నవాబ్‌పేట మండలం ఇప్పటూర్ జెడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తూ గుండె పోటుతో చనిపోయారు. నేను బీటెక్ కంప్లీట్ చేశా. ఇప్పటి వరకు 15-20సార్లు అధికారుల చుట్టూ తిరిగి ఉంటా. జెడ్పీలో పట్టించుకోరు.. కలెక్టరేట్‌కు వస్తే మాకు సంబంధం లేదు. ఇక్కడంటే.. అక్కడ ఇలా తిప్పుతున్నారు. కలెక్టర్ స్పందించి విద్యార్హత ఆధారంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వాలి. మా కుటుంబాన్ని ఆదుకోవాలి.
– సోహెల్, బాబర్ కిరాణం, షాషాబ్‌గుట్ట, మహబూబ్‌నగర్