మహబూబ్నగర్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇన్నాళ్లు బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఊదరగొట్టి 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మరోసారి బూటకమని తేలిపోయింది. బీసీల రిజర్వేషన్ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగానే హడావిడిగా జీవో ఇచ్చి కపట ప్రేమను ప్రదర్శించిందని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. హడావిడిగా ఎన్నికల ప్రక్రియలు ప్రారంభించిన 24గంటలు గడవక ముందే హైకోర్టు మెట్టికాయ వేయడంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయి.
ఎలక్షన్లు జరుగుతాయని ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలు సొంత సర్కారుపైనే మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాము చెప్పిందే నిజమైందని.. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుండా ఎన్నికలు నిర్వహించలేరని ఎంత చెప్పినా ప్రభుత్వం పట్టించుకోకుండా బీసీలను మోసం చేసి ప్రయత్నం చేసిందని మాజీ మంత్రులు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో సర్కారు నడపడంలో పూర్తిగా విఫలమైందని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. కోర్టులు చెబితే నోటిఫికేషన్లు ఇవ్వడం.. చట్టబద్ధత లేకుండానే రిజర్వేషన్లు కల్పించడం ఇదే నా ప్రజాపాలన అంటూ నిలదీస్తున్నారు.
బుధవారం హడావిడి చేసిన కాంగ్రెస్ నేతలు గురువారం నాటికి ప్లేటు ఫిరాయించారు. అధికార యంత్రాంగం కూడా నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సాయంత్రానికి హైకోర్టు ఉత్తర్వులను పరిగణలోకి తీసుకుంటామని ఎన్నికల కమిషన్ వివరణతో అధికార యంత్రాంగం కూడా డీలా పడిపోయింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆగిపోవడంతో సర్కారుకు ఎన్నికలు నిర్వహించే సత్తా లేదని గ్రామాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మళ్లీ కేసీఆర్ వస్తేనే ఎన్నికలు జరుగుతాయని ఘంటాపదంగా చెబుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై హై కోర్టు స్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిది. బీసీలకు 42 శాతం లీగల్గా చెల్లుబాటు కాదని తెలిసి, ఇది రాజ్యాంగ బద్దంగా లేదని కోర్టులో చెల్లదని తెలిసి కూడా కాంగ్రెస్ డ్రామా ఆడి బీసీల మనోభావాలు దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహ రించింది. మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు ఎన్నికలు రద్దు చేసిన విషయం ప్రభుత్వానికి తెలిసినా బీసీ రిజర్వేషన్ల డ్రామాను రేవంత్రెడ్డి రక్తి కట్టించాడు. ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించడానికి చేత కాక బీఆర్ఎస్ పై ఆరోపణలు చేయడం సరైనది కాదు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుండా మూర్కంగా ప్రభుత్వం ఎన్నికలకు పోయి బీసీలను మోసం చేసింది. బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం బీసీలను మోసం చేయడమే. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు ఆ పార్టీకి బొంద పెట్టడం ఖాయం.
– బాసు హనుమంతునాయుడు, బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి