గట్టు, సెప్టెంబర్ 5 : నెట్టెంపాడు ఎత్తిపోతల పరిధిలో నిర్మించిన రిజర్వాయర్ (చిన్నోనిపల్లి) బ్యాక్‌వాటర్ భారీగా వస్తుండడంతో మండలంలోని చిన్నోనిపల్లి గ్రా మం చిన్నబోతున్నది. నీళ్లు వస్తుండడంతో కుటుంబాలు ఒక్కొక్కటిగా గ్రామాన్ని వీడుతున్నాయి. ఇటీవల ఏర్పా టు చేసిన సమాంతర కాల్వ ద్వారా రిజర్వాయర్ నీటిని బయటకు తోడి గ్రామాన్ని ముంపు నుంచి కాపాడతామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నా.. వారి మాటలకు ఇక్కడ జరుగుతున్న తంతుకు ఏ మాత్రం సరిపోలడంలేదు.
కాల్వ ద్వారా బయటకు వెళ్తున్న నీరు కొద్దిగా ఉండగా.. వాగులు, వంకల ద్వారా రిజర్వాయర్‌లోకి వస్తున్న నీరు అధికంగా ఉంటున్నది. దీంతో చిన్నోనిపల్లి గ్రామంలోని కిందిగేరిలో ఉన్న ఇండ్లల్లోకి నీరు చేరింది. ఏ రోజుకారోజు నీటి ప్రవాహం పెరుగుతుండడంతో చి న్నోనిపల్లి దాదాపుగా ఖాళీ అవుతున్నది. గ్రామంలో 261 ఇండ్లు ఉండగా.. ఇప్పటికే దాదాపుగా 50 కుటుంబాలు మూటాముల్లె సర్దుకొని గ్రామం వీడారు. తాము గ్రామా న్ని ఖాళీ చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తున్నదని, గుండె బరువు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఊరును ఖాళీ చేస్తున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. మీడియా ప్రతినిధులు తప్పా గ్రామంలోకి ఏ అధికారిగానీ, ప్రజాప్రతినిధులుగానీ రావడం లేదని ఆందోళన చెందుతున్నారు.
కాగా, ‘పుట్టిపెరిగి, ప్రయోజకులను చేసి న ఊరును వదిలివెళ్లాలంటే బాధగా ఉన్నది. గ్రామ బాగోగులను ఎవరూ పట్టించుకోవడం లేదు. తమకంటూ ఓ రోజు వస్తుంది. ఇబ్బందులు పెట్టిన అందరినీ దేవుడు చూ సుకుంటాడు’ అంటూ గ్రామస్తులు, నిర్వాసితులు సోషల్‌మీడియాలో చేస్తున్న కామెంట్లు ఆలోచింపజేస్తున్నాయి. ఇదిలాఉండగా, తమకు వచ్చే ఆర్థిక ప్రయోజనాలు, ముం పు గ్రామాలతోపాటు పునరావాసాలకు ఇస్తున్న లబ్ధిని కల్పిస్తే న్యాయం జరుగుతుందనే చిన్నఆశతో ఉన్నారు.