మాగనూర్, మే 4 : కలప అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. మొకలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఓ వైపు ప్రచారాలు చేస్తున్న అధికారులు అక్రమంగా చెట్లను నరికి సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అడవిని రక్షించడంతోపాటు వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం వాల్టా చట్టం రూపొందించింది. అయితే చెట్లను నరికివేయాలంటే అటవీ, రెవెన్యూ, గ్రామ పంచాయతీ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. కానీ ఇది ఎకడా అమలు కావడం లేదు.
ఒకవేళ తీసుకున్నా వే బిల్లు లేకుండానే పరిమితికి మించి దండుకుంటున్నారు. నారాయణపేట జిల్లా మఖ్తల్, మద్దూరు, దామరగిద్ద మండలాల్లో నుంచి పక్క రాష్ర్టమైన రాయిచూర్ దేవసూర్లోని పెద్ద పెద్ద పవర్ ప్లాంట్లకు నిత్యం పదుల సంఖ్య డీసీఎం ద్వారా 18 టన్నుల వరకు యథేచ్ఛగా తరలిస్తున్నారు. అధికారులు ప్రభుత్వ సెలవు రోజుల్లో కలప రవాణాకు అనుమతులు ఇచ్చి మరీ పంపిస్తున్నారు. వనసంపద సంరక్షణ కోసం తీసుకువచ్చిన వాల్టా చట్టం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది.
వేప, తుమ్మచెట్లను సైతం అక్రమారులు వదలడం లేదు. వ్యవసాయ భూములు, గుట్టల ప్రాం తాల్లోని చెట్లు, రోడ్డుకు ఇరువైపులా పెరిగిన వృక్షాలు నేలకూలుస్తున్నారు. వాటిని నరికి వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ అమ్ముకుంటున్నారు. చెట్ల నరికివేతపై అధికారుల నియంత్రణ లేకపోవడంతో విచ్చలవిడిగా అక్రమారులు రెచ్చిపోతున్నారు. ఇ ప్పటికైనా అధికారులు స్పందించి కలప అక్రమ ర వాణాకు అడ్డుకట్టవేయాలని ప్రజలు కోరుతున్నారు.
మొకలను పెంచడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయిలు కేటాయిస్తూ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. చెట్లు నరికే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు మొక్కలు పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలి. చెట్లను నరికివేసిన కారణంగా భవిష్యత్లో మరిన్ని కరువు కాటకాలు వచ్చే ప్రమాదమున్నది. ప్రతి ఒకరూ తమవంతు బాధ్యతగా చెట్లను సంరక్షించాలి.
మండలంలో కలప అక్రమంగా రవాణా చేస్తూ, తమ అనుచరులతో అధికారులకు నెలవారీ మామూళ్లు ముట్టజెప్పిస్తున్నట్లు మండలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నెలవారీ మామూళ్లుకి అలవాటు పడిన అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించడంతో కలప రవాణా వ్యాపారుల ఆడిందే ఆట, పాడిందే పాటలాగా తమ దందాను మూడుకొమ్మలు, ఆరు చెట్లలాగా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.