నాగర్కర్నూల్, నవంబర్ 5 : నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం సైతం వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మురుసు వర్షంతో ప్రారంభమై అరగంటపాటు భారీ వర్షం దంచికొట్టింది. దీంతో యథావిధిగా ప్రధాన కూడళ్లు, లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లో వర్షపు నీరు సీసీ రోడ్ల పొడవునా పారుతూ వరదను తలపించింది. ఈశ్వర్కాలనీ, రాఘవేంద్ర కాలనీల మీదుగా వర్షపునీరు ప్రధాన రహదారికి చేరుకోవడంతో 9వ జంక్షన్ వద్ద నీటి ప్రవాహం ఎక్కువైంది. ఉయ్యాలవాడ సమీపంలో సుఖజీవన్రెడ్డి గార్డెన్ ప్రాంతంలోనూ ప్రధాన రోడ్డుపైకి వర్షపునీరు చేరుకుంది.
ఒక్కసారిగా రోడ్డుపైకి నీరు చేయడంతో కొద్దిసేపు చిన్నపాటి వాహనదారులు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. ప్రధాన రహదారి-నల్లవెల్లి రోడ్డు మధ్య భాగంలో ఉన్న కాలనీల్లోని ఇండ్ల మధ్య వర్షపునీరు చేరుకొని ఖాళీ జాగలు చిన్నపాటి కుంటలను తలపిస్తున్నాయి. మంగళవారం కురిసిన వర్షంతోనే లోతట్టుగా ఉన్న అన్ని కాలనీలు జలదిగ్బంధం కాగా మున్సిపల్ అధికారులు బుధవారం ఉదయం నుంచి సహాయక చర్యలు చేపట్టారు. ఇంతలో మధ్యాహ్నం మళ్లీ వర్షం పడడంతో ఆయా కాలనీల్లోకి, ఇండ్ల మధ్యకు యథావిధిగా నీరు చేరుకుంది.
బుధవారం సైతం రోడ్లపై నిలిచిన వర్షపునీటిని చెరువు వైపునకు మళ్లించారు. సెలవు కావడంతో పట్టణంలో వాహనాల రద్దీ కాస్త తక్కువగా ఉండింది. దీంతోరాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నాగర్కర్నూల్ కేసరి సముద్రం చెరువు ఇరువైపులా అలుగుపారుతోంది. ఇప్పటికే పాలెం పెంటోని చెరువు అలుగు పారుతుండగా ఆ నీరు చేరడంతో నాగర్కర్నూల్ చెరువు నిత్యం అలుగుపారుతున్నది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి కేసరి సముద్రం చెరువు అలుగు ఉధృతి పెరిగింది.