మహబూబ్‌నగర్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నాగర్‌కర్నూల్ : ఉమ్మడి మహబూ బ్‌నగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రధాన వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఆయా జిల్లా కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు లో తట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలకు కేసరి సముద్రం చెరువు, నాగనూలు చెరువు నిండి అలుగుపారుతున్నాయి. నియోజకవర్గంలోనే పెద్దదైన బిజినేపల్లి మండలం పాలెం పెంటోని చెరువు నిండుకుండలా మారి అలుగుపారుతున్నది. వనపర్తి జిల్లాలో శంకరసముద్రం రెండు గేట్లు ఎత్తివేశారు. నారాయణపేట జిల్లా సంగంబండ రిజర్వాయర్‌కు కూడా భారీగా వరద నీరు వస్తుండడంతో గేట్లుఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
ఉమ్మడి జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. అటు తుంగభద్ర నదికి కూడా భారీ వరద వచ్చి చేరుతుంది. గద్వాల జిల్లా భారీ వర్షాలకు అనేక చోట్ల రహదారులు తెగిపోయాయి. వా గులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అన్ని జిల్లాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో చెరువులు, కుంటలు అలుగుపారుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో దుందుభీనది, ఊకచెట్టు వాగులు కూడా జలకళ సంతరించుకున్నాయి. అనేక చెక్‌డ్యామ్‌లు పొంగిపొర్లుతున్నాయి. దేవరకద్ర నియోజకవర్గంలోని కందూరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాముల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. మరోవైపు ప్రధాన ప్రాజెక్టులకు వరద వస్తుండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జలకళ సంతరించుకుంది.
భారీ వర్షాలకు అనేక చోట్ల చెరువులు ఉప్పొంగడంతో వందలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది.
మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లా కలెక్టర్లు సూచిస్తున్నారు. వాగులు, వంకల వద్ద రాకపోకలు నిలిపివేశారు. తాడూరు మండలంలో వాగులో చిక్కుకున్నారని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో అప్రమత్తమైన అధికారులు అక్కడికి వెళ్లి అదంతా వట్టిదేనని తేల్చేశారు. సోషల్ మీడియాలో అబద్ధపు రాతలు రాయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆయా జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టరేట్లలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. వర్షాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టారని జిల్లా కలెక్టర్లు అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టడంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు.
ఐదు జిల్లాల్లో మూడ్రోజులు విస్తారంగా వర్షా లు కురుస్తున్నాయి. మదనాపురం మండలం దంతనూ రు శివారులో వాగు పొంగి పొర్లుతున్నది. శంకరసముద్రం రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో దంతనూరు-శంకరమ్మపేట గ్రామా ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలంపూర్ మండలంలో సోమవారం 93.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాజోళి మండల కేం ద్రంలో వివిధ గ్రామాల రోడ్లు జలమయం కావడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు. ఉండవెల్లి మండలంలో వాగులు, వంకలు పొంగి పొర్లా యి. పంటలు నీటి మునిగాయి.
అలంపూర్ మండలంలోని అక్బర్పేట జలమయమైంది. సరైన కాల్వలు, రోడ్లు లేకపోవడంతో ఇండ్లలోకి నీళ్లు చేరాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మానవపాడు నుంచి చెన్నిపాడు మీదుగా పోతులపాడు వెళ్లే వాగు ఉప్పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మానవపాడు-అమరవాయి మధ్య ఉన్న పెద్దవాగు ఉధృతంగా పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణ వర్షపునీటితో చిన్నపాటి కుంటను తలపించింది. చిన్నంబావి మండలంలో పలు చోట్ల పంటపొలాల్లో నీరు ముంచెత్తింది. మహమ్మదాబాద్ మండలం జూపల్లిలో గాలివానతో రేకుల షెడ్డు కూలి నాలుగు మేకలు మృతి చెందగా, పది మేకలు గాయపడ్డాయి.
హన్వాడ మండలంలోని ఉదయపూర్, వేపూర్ వద్ద వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలు మత్తడి దుంకాయి. తాడూరు మండలంలోని దుందుభీవాగు ఉప్పొంగింది. నాగర్‌కర్నూల్‌లోని కేసరి సముద్రం, నాగనూలు చెరువులు నిండుకుండల్లా మారి అలుగు పారుతున్నాయి. నాగనూలు-నాగర్‌కర్నూల్ మధ్య చోడ్డు కల్వర్టుపై నుంచి వరద పారుతుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాగర్‌కర్నూల్ పట్టణంలోని రాంనగర్, ట్యాంక్‌బండ్ ఏరియా, స్నేహపురి కాలనీ, పద్మావతి కళాశాల, విశ్వవికాస్ డిగ్రీ కళాశాల, లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరదనీరు చేరింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. కోడేరు మండలం బావాయిపల్లి వాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోయినట్లుగా ప్రచారం జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అధిక వర్షాల కారణంగా ఆయా జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తం చేశారు.