బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తున్నది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతుండడంతో అలుగు పారుతున్నాయి. తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడిన ప్రజలు ఉపశమనం పొందారు. పలుచోట్ల రహదారులు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్ల పై నీళ్లు పారడంతో చిన్నపాటి చెరువులను తలపించాయి. కోయిల కొండ మండలంలోని దమాయపల్లిలో గణపతిరాయుడి చెరువు అలుగుపారడంతో గ్రామానికి వెళ్లే వంతెన నీటి ప్రవాహానికి కొట్టుకు పోయింది. పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. వర్షాల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఒకవైపు వాన ప్రజలకు ఇబ్బందులు కలిగించినా.. రైతులకు మాత్రం మేలు కలిగించింది. పంటలు ఎండిపోతున్న తరుణంలో చినుకులు పడడంతో జీవం పోసినైట్లెంది.
– నెట్వర్క్ (నమస్తే తెలంగాణ), సెప్టెంబర్5
మహబూబ్నగర్, సెప్టెంబర్ 5 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మూడు రోజులుగా కుంభవృష్టి వర్షం కురుస్తున్నది. మూడు రోజులుగా ముసురు వర్షాలు ఎడతెరిపి కురుస్తుండడంతో కొన్ని పంటలకు జీవం వచ్చింది. పలు చోట్ల చెరువు, కుంటలకు భారీగా నీరువచ్చి చేరింది. వాగులు, వంకలు పారుతున్నాయి. మరో రెండు, మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెడ్అలర్ట్ ప్రకటించింది. రెడ్అలర్ట్గా గుర్తించిన జిల్లాల్లో మహబూబ్నగర్ కూడా ఉంది. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు అలర్ట్అయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.