గద్వాల/ అయిజ/ శ్రీశైలం, జూలై 1 : ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టుకు రోజురోజుకు వరద ఉధృతి పెరుగుతున్నది. మంగళవార ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 87,000 క్యూసెక్కులు నమోదు కాగా తొమ్మిది గేట్లు ఎత్తి శ్రీశైలానికి 60,075 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎగువ నుండి కృష్ణమ్మ జూరాల వైపు రాకతో జూరాలకు జళ కళ సంతరించుకుంది.రోజు రోజుకు వరద ఉధృతి పెరుగుతూ వస్తుంది. జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది.ఎగువన వర్షాలు కురుస్తుండడంతో జూరాల వైపు కృష్ణమ్మ పరుగులు తీయడంతో ప్రాజెక్టుకు వరద పోటెత్తింది.దీంతో జూరాల ప్రాజెక్టు 09గేట్లు ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.
అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తికి 30,722 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా భీమా లిఫ్ట్-1కు 650, కోయిల్‌సాగర్ లిఫ్ట్‌కు 315, జూరాల ప్రధాన ఎడమ కాల్వవకు 550, కుడి కాల్వకు 280, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 150క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా మొత్తంగా అవుట్ ఫ్లో 92,985 క్యూసెక్కులుగా నమోదైంది. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.590 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కర్ణాటకలోని తుంగ, భద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద నీరు చేరుతున్నది. దీంతో తుంగభద్ర డ్యాం పవర్ హౌస్‌కు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో 28,902 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 2,386 క్యూసెక్కులు నమోదైంది. గరిష్ఠ నీటిమట్టం1633 అడుగులకు గానూ 1624.38 అడుగుల నీటి మట్టం ఉండగా, 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 74.486 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది.
శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. మంగళవారం జూరాల ప్రాజెక్టు విద్యుదుత్పత్తి ద్వారా 30,722 క్యూసెక్కు లు, క్రస్ట్ గేట్ల ద్వారా 60,075 క్కూసెక్కుల నీరు విడుదలై సాయంత్రానికి 84,801 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు చేరింది. అదే విధంగా జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 874.80 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 162.4372 టీఎంసీలు ఉన్నాయి. జలాశయానికి ఇన్‌ఫ్లో 90,797 క్యూసెక్కులు కాగా 58,750 క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.