నాగర్కర్నూల్, జూలై 31 : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. గత రెండు, మూడు రోజులుగా కృష్ణానదీ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలానికి భారీగా వరదనీరు చేరుతోంది. శుక్రవారం జూరాల క్రస్ట్ గేట్ల ద్వారా 95 ,592 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 35,502 క్యూసెక్కులు వరద నీరు చేరుతోంది.
మొత్తంగా లక్షా 31 వేల 94 క్యూసెక్కులు జూరాల ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కాగా శుక్రవారం సాయంత్రానికి 92,709 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి చేరింది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 834.40 అడుగులకు ఉన్నది. పూర్తిస్థాయి నీటి సామర్ధ్యం 215 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 54.34 టీఎంసీలుగా ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అయితే ప్రాజెక్టు కుడి, ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ఇంకా ప్రారంభించలేదు.